'రేవంత్ ఎక్కడ అడుగు పెడితే ఆ పార్టీ ఖతం'

8 Feb, 2023 18:06 IST|Sakshi

హైదరాబాద్‌: ప్రగతి భవన్‌ను పేల్చేయాలి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు. పాదయాత్రకు ఆదరణ కరువు కావడంతో అసంఘటిత శక్తులు మాట్లాడే మాటలు ఆయన మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రగతి భవన్‌ను పేల్చాలని నక్సలైట్లకు పిలుపునివ్వడమేంటమని మండిపడ్డారు. 'రేవంత్ వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ ఖండిస్తోంది. భట్టి విక్రమార్క రేవంత్ వ్యాఖ్యలను సమర్థిస్తారా? అది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయమాలేక వ్యక్తిగతమా చెప్పాలి. కాంగ్రెస్ నైతిక బాధ్యత వహించాలి.' అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు.

బయట తిరగలేడు..
'రేవంత్వి అన్ని అబద్ధాలే. వ్యవస్థ మీద ఆయనకు నమ్మకం లేదు. నక్సలైట్లను చర్చలకు పిలిచి కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్‌ది. అనర్హుడికి పీసీసీ పదవి ఇచ్చారు. రేవంత్ ఇలాగే మాట్లాడితే బయట తిరగలేడు. రాజకీయ చైతన్యం ఉన్న జిల్లాలో తిరుగుతున్నావ్... ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ప్రజలకు, నక్సలైట్లకు క్షమాపణ చెప్పాలి' అని మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు.

ఐటెం సాంగ్..
'రేవంత్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆ పార్టీ ఖతం. తెలుగుదేశంలోకి వచ్చి ఆ పార్టీని నాశనం చేశారు. రేవంత్‌ను ప్రజలు ఐటెం సాంగ్ గానే చూస్తారు. ఆయన వెంట ఉండేవారు కిరాయివాళ్లే. నర్సంపేటలో పాదయాత్ర ఎందుకు చేయలేదు? అక్కడ తంతారనా? రేవంత్ ఓ బ్రోకర్. ఆయనకు ఇంగిత జ్ఞానం ఉందా? ఆయనపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి. మోదీ ఆఫీస్‌ను కూడా పేల్చేయాలని రాహుల్ గాంధీకి రేవంత్ ఎందుకు చెప్పలేదు? ఇలాగే మాట్లాడితే ప్రజలు తరిమి కొడతారు. నక్సలైట్ల ఎజెండా మంచిగానే ఉంటుంది. నాకు చదువు రాకపోతేనే ఏడు సార్లు గెలిచానా?' అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజమెత్తారు.
చదవండి: రేవంత్‌ వ్యాఖ్యల దుమారం.. పీడీ యాక్ట్‌ పెట్టాలని ఫిర్యాదు!

మరిన్ని వార్తలు