తెలంగాణలో కరువు, కర్ఫ్యూ లేదు

11 Oct, 2023 05:10 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు. చిత్రంలో వినోద్‌కుమార్, ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌

బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోతో ప్రతిపక్షాల మైండ్‌ బ్లాంక్‌ కావడం ఖాయం 

కాంగ్రెస్‌వి ఫేక్‌ సర్వేలు, గ్లోబల్‌ ప్రచారాలు 

ఢిల్లీలో కాంగ్రెస్‌ ముఠా టికెట్ల పంచాయితీ: హరీశ్‌రావు 

హుస్నాబాద్‌ (సిద్దిపేట జిల్లా): బీఆర్‌ఎస్‌ పాలనలో కరువు, కర్ఫ్యూ అనే మాటే ఎప్పుడూ రాలేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఒకప్పుడు తిండిలేని తెలంగాణ ఈరోజు దక్షిణాది ధాన్య భాండాగారంగా మారిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మంగళవారం జరిగిన బీఆర్‌ఎస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ నెల 15న బీఆర్‌ఎస్‌ మేనిఫేస్టోను అధినేత కేసీఆర్‌ ప్రకటించనున్నారని, ఆ మేనిఫేస్టో చూసి ప్రతిపక్షాల మైండ్‌ బ్లాక్‌ కావడం ఖాయమని వ్యాఖ్యానించారు. నవంబర్‌ 3న నోటిఫికేషన్, నవంబర్‌ 30న పోలింగ్, డిశంబర్‌ 3న ఫలితాలు కలిసోచ్చే 3 అనే సంఖ్య రావడంతో బీఆర్‌ఎస్‌ వచ్చే ఎన్నికల్లో 3వ సారి గెలిచి హ్యా ట్రిక్‌ సాధించడం ఖాయమన్నారు. 

అవినీతి సొమ్ముతో కాంగ్రెస్‌... 
మాటలు, డబ్బు మూటలు, కర్ఫ్యూలకు, మత కల్లోలాలకు పెట్టింది పేరైన కాంగ్రెస్‌ పార్టీ... మంటల ముఠాలతో ఎన్నికలు చేయాలనుకుంటోందని మంత్రి టి.హరీశ్‌రావు ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఫేక్‌ సర్వేలు, గ్లోబల్‌ ప్రచారాలు చేయడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. కర్ణాటకలో సంపాదించిన అవినీతి సొమ్ముతో తెలంగాణలో గెలవాలని ఆ పార్టీ చూ స్తోందని దుయ్యబట్టారు. ముఠా రాజకీయాలతో ఢిల్లీలో టికెట్ల పంచాయితీ చేస్తోందని మండిపడ్డారు.

2004 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ టీఆర్‌ఎస్‌ (ప్రస్తుత బీఆర్‌ఎస్‌)తో పొత్తు పొట్టుకొని అధికారంలోకి వచ్చాక తమను మోసం చేసిందని, పొత్తు పెట్టుకున్న పార్టీని పొట్టన పెట్టుకుందామని చూసిందని ఆరోపించారు. మూడు గంటల కరెంట్‌ రైతులకు చాలన్న కాంగ్రెస్‌ మంచిదా, రైతుల మోటార్లకు మీటర్లు పెడుతున్న బీజేపీ మంచిదా, మూడు పంటలకు సరిపడా 24 గంటల కరెంట్‌ ఇస్తున్న కేసీఆర్‌ మంచోడా అనే విషయాన్ని ప్రజలు ఆలోచించాలని హరీశ్‌రావు కోరారు. ప్రాజెక్టుల ద్వారా నీళ్లు వస్తే అందరూ సంతోషిస్తారని, కానీ ప్రతిపక్షాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయని విమర్శించారు. సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు. 

హుస్నాబాద్‌లో కేసీఆర్‌కు తొలి ‘ఆశీర్వాదం’ 
హుస్నాబాద్‌: హుస్నాబాద్‌ ప్రజలపై ఉన్న నమ్మకంతోనే సీఎం కేసీఆర్‌ ఎన్నికల శంఖారావానికి మరోసారి హుస్నాబాద్‌ వేదిక కాబోతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఈ నెల 15న నిర్వహించే కేసీఆర్‌ ఎన్నికల శంఖారావ బహిరంగ సభ స్థలాన్ని మంగళవారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌లతో కలసి ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్‌కు ఈశాన్యంలో ఉండే హుస్నాబాద్‌ను కేసీఆర్‌ సెంటిమెంట్‌గా భావిస్తారన్నారు. ఒకప్పుడు కరువు కాటకాలకు నిలయంగా ఉన్న హుస్నాబాద్‌ నియోజకవర్గాన్ని నేడు కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలం చేశారని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు