అలా ప్రచారం చేస్తే.. నడిరోడ్డుపై నిలబెట్టి కొడతా: రేఖా నాయక్‌

18 Sep, 2023 17:33 IST|Sakshi

సాక్షి, నిర్మల్‌ : ఖానాపూర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రేఖా నాయక్‌.. తన పార్టీ తరుపున ఆ నియోజకవర్గ అభ్యర్థి జాన్సన్‌ నాయక్‌కు సాలిడ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. నియోజకవర్గంలో రేఖా నాయక్‌ ఎలాంటి అభివృద్ధి చేయలేదని.. తాను గెలిచాక చేస్తానని జాన్సన్‌ ప్రచారం చేస్తుండడంపై ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అబద్ధాలు గనుక ప్రచారం చేస్తే.. నడిరోడ్డుపై కొట్టేందుకు కూడా వెనకాడబోనని హెచ్చరించారామె. 

తానింక బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని రేఖా నాయక్‌.. రెబల్‌గా అయినా పోటీ చేసి తీరతానని స్పష్టం చేశారు. ప్రజలు ఇప్పటివరకు రెండు సార్లు ఆశీర్వదించి గెలిపించారని.. చేసిన సేవలు నచ్చితే మూడోసారి రెబల్‌గా కూడా తనను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారామె. ‘‘రాథోడ్‌ రమేష్‌ నాపై దాడి కోసం వస్తే.. ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వలేదు. అలాంటిది ఇప్పుడు కేవలం అభ్యర్థి అయిన జాన్సన్‌ నాయక్‌ విషయంలో ఏ హోదాతో సెక్యూరిటీ ఇస్తున్నారు. ఎందుకు ప్రొటోకాల్‌ పాటిస్తున్నారు. ఆయన కేవలం అభ్యర్థి మాత్రమే కదా’’ అని ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నించారామె.  

జాన్సన్‌ నాయక్‌కు ఏం తెల్వదు. కేవలం కేటీఆర్‌కు క్లోజ్‌ ఫ్రెండ్‌ అనే టికెట్‌ ఇచ్చారు.  ఈ విషయంలో కేటీఆర్‌ను కలిసినప్పుడు కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా.  ఖానాపూర్‌ విషయంలో తనకు టికెట్‌ ఇవ్వనప్పుడు.. స్థానికులకు ఎవరికైనా టికెట్‌ ఇచ్చి ఉంటే బాగుండేది. అలా కాకుండా జాన్సన్‌కు ఇవ్వడం అభ్యంతరకరంగా ఉంది. నేను అభివృద్ధి చేయలేదని ప్రచారం చేస్తే ఊరుకోను.నేను  ఏమి అభివృద్ధి చేశానో ప్రజలకు తెలుసు.  అసెంబ్లీలో కేటీఆర్‌ సమక్షంలోనే.. డిగ్రీ కాలేజ్‌.. రెవెన్యూ డివిజన్‌ అడిగింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారామె. ఈ క్రమంలోనే.. అబద్దాలు ప్రచారంచేస్తే జాన్సన్  నాయక్‌ను  నడిరోడ్డు పై  నిలబెట్టి కొట్టడానికి వెనకాడబోనని హెచ్చరించారామె. న్నారు. 

జాన్సన్‌ను ప్రశ్నిస్తే రౌడీయిజం చేస్తున్నాడని.. ప్రశ్నించినవాళ్లపై దాడులు చేస్తున్నాడని రేఖా నాయక్‌ ఆరోపించారు.  తనకు సెక్యూరిటీని తగ్గించేశారని.. తన అనుచరులనూ బైండోవర్‌లు చేస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు.   ఇప్పుడేం   కాలేదు బిడ్డా.. ఎన్నికలలో ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమంటూ జాన్సన్‌ నాయక్‌కు ఉద్దేశించి  రేఖా నాయక్‌ ఘాటు వ్యాఖ్యలే చేశారు.

మరిన్ని వార్తలు