భయపడే వాళ్లు ఎవరూ లేరు.. ఒవైసీకి ఎమ్మెల్యే షకీల్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

30 Jun, 2023 08:49 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీకి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే షకీల్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఎన్నికల్లో చూసుకుందామని బెదిరిస్తే భయపడే వారు ఇక్కడ ఎవరూ లేరు అంటూ స్ట్రాంగ్‌ కామెంట్స్‌ చేశారు. దీంతో, ఎ‍మ్మెల్యే వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 

కాగా, బీఆర్‌ఎస్‌ బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ శుక్రవారం ఓ వీడియోలో మాట్లాడుతూ.. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ బ్లాక్‌ మెయిలింగ్‌ రాజకీయాలు చేస్తున్నారు. ఎన్నికలు రాగానే ఆయన నైజం బయటపెడుతున్నారు. ఎన్నికల్లో చూసుకుంటామని బెదిరిస్తే భయపడే వారు ఎవరూ లేరు. దమ్ముంటే ముందు నుండి కొట్లాడండి.. వెనుక నుండి కాదు. నేనెవరి మీదా తప్పుడు కేసులు పెట్టలేదు. ఎంఐఎం కౌనిల్సర్లు నామీద ముమ్మాటికీ హత్యాయత్నం చేశారు. ప్లాన్ ప్రకారమే ఆరోజు నామీద దాడి చేసి చంపాలనుకున్నారు. 

ప్రస్తుతం జైలులో ఉన్న నిందితులపై సంఘ విద్రోహా కేసులు ఉన్నాయి. దొంగతనం, రౌడీయిజం, మర్డర్‌ ఇలా చాలా కేసులు వారిపై ఉన్నాయి. బోధన్‌ బీఆర్‌ఎస్‌ రాజకీయ నేత శరత్‌ రెడ్డి, ఎంఐఎం నేతలు కలిసి నాపై కుట్రలు చేస్తున్నారు. ఈ హత్యాయత్నం కేసులో పోలీసులే నిజానిజాలు తేలుస్తారు. ఈసారి ఎన్నికల్లో తేల్చుకుందాం. బోధన్‌ ప్రజలు నాతోనే ఉన్నారు అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: అరెస్ట్‌ అయిన వారంతా కవిత గెలుపు కోసం పనిచేశారు: ఎంఐఎం ఒవైసీ


 

మరిన్ని వార్తలు