బీఆర్‌ఎస్‌ సభ అట్టర్‌ ఫ్లాప్‌

20 Jan, 2023 01:01 IST|Sakshi

బండి సంజయ్‌ విసుర్లు

లిక్కర్, గోల్డ్‌ స్కామ్‌ల సీఎంలే వచ్చారు

కేసీఆర్‌ దగ్గరకు ఒకసారి వచ్చిన నేతలు మళ్లీ రారు

సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్‌ఎస్‌ పార్టీ ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభ అట్టర్‌ ఫ్లాప్‌ అయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. డబ్బులిచ్చి, బెదిరించి ప్రజలను తీసుకొచ్చి సభను విజయవంతం చేసేందుకు ప్రయత్నించినా అది ఫలించలేదన్నారు. ఇండియా, న్యూజిలాండ్‌ మ్యాచ్‌ను తప్ప బీఆర్‌ఎస్‌ సభను ప్రజలు పట్టించుకోలేదని చెప్పారు. సభకు కేవలం లిక్కర్, గోల్డ్‌ స్కాముల్లో ఇరుక్కున్న ముఖ్యమంత్రులే వచ్చారని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

పంజాబ్, తెలంగాణ సీఎంలు తాగి ఊగడంలో జాన్‌ జబ్బలు అంటూ విమర్శించారు. కేసీఆర్‌ దగ్గరకు ఒకసారి వచ్చినోళ్లు మళ్లీ రారని, బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిలు అందుకే ఖమ్మం సభకు రాలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఖమ్మం సభకు వచ్చిన నేతలు ఇకపై కనబడరని అన్నారు. ఆలయాల మాటున వ్యాపారం ఎట్లా చేయొచ్చో చెప్పేందుకే ముఖ్యమంత్రులను కేసీ ఆర్‌ యాదాద్రి తీసుకెళ్లారని ఆరోపించారు. సంజయ్‌ గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు.  

కేసీఆర్‌ దయచేసి దేశం పేరెత్తకు..
‘కేసీఆర్‌ ఏ దేశం పేరెత్తి మాట్లాడితే ఆ దేశం ఔట్‌ అవుతోంది. గతంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక పేర్లు ప్రస్తావించాడు. ఇప్పుడు ఆ దేశాలు అడుక్కునే స్థితికి వెళ్లాయి. చైనా పేరెత్తితే ఆ దేశం కరోనాతో చస్తోంది. కేసీఆర్‌.. దయచేసి భారత్‌ బాగుందని చెప్పొద్దు. నీ నోరు అంత మంచిది కాదు..’ అంటూ సంజయ్‌ ఎద్దేవా చేశారు. ‘కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణ వాటాను వాడుకోలేని కేసీఆర్‌ దేశ జల విధానం గురించి మాట్లాడటం సిగ్గుచేటు.

తుపాకీ రాముడి మాదిరిగా టోపీ పెట్టుకుని, మేక్‌ ఇన్‌ ఇండియాను విమర్శించడం విడ్డూరం. తొలి కేబినెట్‌లో ఒక్క మహిళకు చోటివ్వలేదు. ఇప్పుడు మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు ఇస్తాననడం హాస్యాస్పదం. మహిళా బిల్లును చింపేసిన ఎస్పీ నేత పక్కనే ఉన్నారు. ఆయనకు తెలుగు అర్ధమైతే కొట్టి వెళ్లేవా డు. తెలంగాణ సెంటిమెంట్‌తో అధికారంలోకి వచ్చి ‘జై తెలంగాణ’ అనే పదాన్ని విస్మరించిన తెలంగాణ ద్రోహి కేసీఆర్‌..’ అని  మండిపడ్డారు.   

మరిన్ని వార్తలు