‘బీఆర్‌ఎస్‌ సభలో కానరాని బీజేపీ వ్యతిరేక ఎజెండా’

20 Jan, 2023 03:14 IST|Sakshi

పొంగులేటిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నాం: భట్టి 

ఖమ్మం సహకారనగర్‌: దేశ సంస్కృతి, సంపదతోపాటు ప్రభుత్వరంగ సంస్థలు, వ్యవస్థలను ప్రైవేట్‌పరం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎజెండా ప్రకటిస్తారని జరిగిన ప్రచార ఆర్భాటానికి తగ్గట్టుగా ఖమ్మం బీఆర్‌ఎస్‌ సభ లేదని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ఎద్దేవా చేశారు. కనీసం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు పనికొచ్చే ఎజెండా కూడా లేదని అన్నారు.

గురువారం ఇక్కడి కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఇతర రాష్ట్రాల సీఎంలను తీసుకొచ్చి ఆర్భాటంగా నిర్వహించిన సభలో దేశానికి దశదిశ ఇచ్చే ఎజెండా లేకపోవడం, ప్రజలు ఆశించినవి కూడా ప్రకటించకపోవడం విచారకరమన్నారు. పోడుపట్టాలు, పేదలకు ఇళ్లస్థలాలు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, సింగరేణి ప్రైవేటీకరణ, బయ్యా రం ఉక్కు ఫ్యాక్టరీ వంటి హామీల ఊసెత్తలేదని ఆరోపించారు.

ప్రజలను విభజించి, విద్వేషాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్న బీజేపీని కట్టడి చేయడం కాంగ్రెస్‌తోనే సాధ్యమని భట్టి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వామపక్ష పార్టీలు తమతో కలిసి ప్రయాణం చేస్తే బాగుంటుందని ఆకాంక్షించారు.  కాగా, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలోకి రావాలని మీడియా సాక్షిగా ఆహ్వానిస్తున్నట్టు భట్టి తెలిపారు. ఆయన కాంగ్రెస్‌లోకి రావడానికి తాను అడ్డుగా లేనని చెప్పారు.   

మరిన్ని వార్తలు