గ్యాస్ ధరల పెంపుపై కేటీఆర్ ఫైర్.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపు

1 Mar, 2023 18:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత రాష్ట్ర సమితి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై విమర్శలతో విరుచుకుపడ్డారు.  రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికలు అయిపోయిన వెంటనే ప్రతిసారి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం కేంద్రానికి ఆనవాయితీగా మారిందని ధ్వజమెత్తారు. తాజాగా గృహ అవసరాల సిలిండర్ ధరను రూ.50,  కమర్షియల్ సిలిండర్ ధరను రూ.350 మేర భారీగా పెంచడంపై మండిపడ్డారు.

'ఆయా రాష్ట్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్న వెంటనే ఇంత భారీగా సిలిండర్ ధరను పెంచడం దారుణం. మహిళా దినోత్సవం సందర్భంగా దేశ మహిళలకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన కానుకనా ఈ సిలిండర్ ధరల పెంపు? శుక్రవారం అన్ని నియోజకవర్గ, పట్టణ, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున సిలిండర్ ధరల పెంపుపై నిరసన కార్యక్రమం చేపట్టాలి. ఎక్కడి వారక్కడ వినూత్నంగా ఆందోళనలు చేయాలి.

మహిళా దినోత్సవం రోజున సైతం గ్యాస్ ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను చేపట్టాలి. మోదీ ప్రభుత్వం రాకముందు రూ.400 ఉన్న సిలిండర్ ధర ఈరోజు రూ.1,160 దాటి రూ.1,200లకు చేరుకుంది.  ఉజ్వల స్కీంలో ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా లబ్ధి పొందిన మొదటి మహిళ సైతం ఈరోజు సిలిండర్‌ను కొనలేక కట్టెల పొయ్యిపై వంట చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా అడ్డగోలుగా సిలిండర్ ధరలను పెంచకుండా, పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి' అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
చదవండి: బీజేపీలో చేరిన జగిత్యాల మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ శ్రావణి

మరిన్ని వార్తలు