యడ్డీకి అస్త్ర సన్యాసమే మార్గమా?

23 Jul, 2021 08:41 IST|Sakshi

రాజీనామాకు సీఎం మొగ్గు

సాక్షి, బెంగళూరు: రాష్ట్ర బీజేపీలో రాజకీయాలు ఒక్కరోజులోనే మారిపోయాయి. నిన్నటివరకు సీఎం కుర్చీ నుంచి దిగేది లేదని తెగేసి చెప్పిన యడియూరప్ప స్వరం మార్చారు. అధిష్టానం ఆదేశాలే శిరోధార్యమని గురువారం విధానసౌధలో మీడియా ముందు ప్రకటించడం సంచలనం రేపింది. తదుపరి సీఎంగా ఎవరు ఉండాలో తాను చెప్పలేనన్నారు. పెద్దసంఖ్యలో స్వామీజీలు ఆయన రాజీనామా చేయకూడదని రెండురోజుల నుంచి బెంగళూరులో చర్చలు జరపడం తెలిసిందే. ఈ తరుణంలో యడియూరప్ప అస్త్ర సన్యాస ప్రకటన వెలువడింది.  

ఆ మంత్రుల మద్దతు..  
మరోవైపు యడియూరప్ప మద్దతుదారులైన మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేయాలా అని వ్యూహ రచనలో నిమగ్నమయ్యారు. కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరి మంత్రులైనవారు రాజీనామా బాట పట్టినట్లు తెలుస్తోంది. వారు యడియూరప్పకు మద్దతుగా నిలిచినట్లు సమాచారం. మంత్రులు కె.సుధాకర్, కె.గోపాలయ్య, భైరతి బసవరాజ్, శివరామ్‌ హెబ్బార్, బీసీ పాటిల్, ఎస్‌టీ సోమశేఖర్‌ తదితరులు సీఎం బీఎస్‌వైతో రహస్య మంతనాలు చేసినట్లు సమాచారం.  

సీఎం రేసులో లేను: సీటీ 
బనశంకరి: నేను పార్టీ కార్యకర్తను మాత్రమే. ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదు అని బీజేపీ జాతీయ ప్రధాన  కార్యదర్శి సీటీ రవి అన్నారు. ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ సీఎం రేసులో లేనని, కానీ తన పేరు మీడియాలో వస్తోందని చెప్పారు. సీఎం నియామకం వెనుక మఠాధీశుల హస్తం ఉందా, లేదా అనేది హైకమాండ్‌ గమనిస్తుందని అన్నారు.  

నేను రేసులో ఉన్నా: కత్తి 
యశవంతపుర: ఎనిమిదిసార్లు ఎమ్మెల్యే అయిన తనకు రాష్ట్రాన్ని పాలించే ఆశ ఉన్నట్లు మంత్రి ఉమేశ్‌కత్తి చెప్పారు. ఆయన బెంగళూరులో విలేకర్లుతో మాట్లాడుతూ నేను యడియూరప్పకు సమానంగా ఉన్నా. నేను సీఎం కావడానికి 15 ఏళ్లు అవకాశం ఉంది. ఏదో ఒక రోజు సీఎం కావటం తథ్యం అన్నారు. సీఎం పదవి నుంచి యడియూరప్పను గౌరవప్రదంగా సాగనంపాలన్నారు.   

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు