నా రాజీనామా వార్తలన్నీ పుకార్లే: యడియూరప్ప

18 Jul, 2021 01:04 IST|Sakshi
రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో భేటీ అయిన కర్ణాటక సీఎం యడియూరప్ప 

కర్ణాటక సీఎం యడియూరప్ప వెల్లడి

సాక్షి, బెంగళూరు: కర్ణాటక సీఎంగా కొనసాగాలని బీజేపీ కేంద్ర నాయకత్వం తనను కోరిందని బీఎస్‌ యడియూరప్ప వెల్లడించారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో జరిగిన భేటీల్లో రాష్ట్రంలో నాయకత్వ మార్పిడి అంశమే చర్చకు రాలేదన్నారు. శుక్రవారం ప్రధాని మోదీతో సమావేశమై రాష్ట్రంలో పరిస్థితులు, వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు గురించి చర్చించినట్లు ఆయన చెప్పారు. శనివారం ఉదయం ఢిల్లీలోని కర్ణాటక భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

కర్ణాటకలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వచ్చే ఆగస్టు మొదటి వారంలో మరో సారి ఢిల్లీకి వస్తానని చెప్పారు. తను రాజీనామా చేయనున్నట్లు వచ్చిన వార్తలపై ఆయన స్పందిస్తూ.. సామాజిక మాధ్యమాల్లో ఈ మేరకు తప్పుడు ప్రచారం జరిగిందన్నారు. ‘ఢిల్లీకి వచ్చి పార్టీ పెద్దలతో భేటీ కావడంతో తప్పు లేదు, అంతమాత్రాన రాజీనామా చేస్తున్నట్లు కాదు, ఆ పరిస్థితే రాలేదు’ అని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల వరకు కర్ణాటక సీఎంగా కొనసాగుతాననీ, రాష్ట్రంలో తమ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం తథ్యమన్నారు.

తమిళనాడుతో తలెత్తిన జలవివాదంపైనా ప్రధానితో చర్చించినట్లు యడ్డి తెలిపారు. కావేరీ నదిపై తలపెట్టిన మేకెదాటు పథకం విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని కోరానన్నారు. ఇదే విషయంపై కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడా భేటీ అయి చర్చించానన్నారు. కాగా, హోం మంత్రి అపాయింట్‌మెంట్‌ ఖరారు కాకపోవడంతో, బెంగళూరుకు రావడానికి యడియూరప్ప ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. అంతలోనే హోం మంత్రి అమిత్‌షా నుంచి పిలుపు రావడంతో వెళ్లి అరగంటపాటు ఆయనతో భేటీ అయ్యారు. 

మరిన్ని వార్తలు