‘మా సీఎం మారడు.. 65 మంది మద్దతు ఉంది’

7 Jun, 2021 19:25 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రేణుకాచార్య

బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశానికి సంబంధించి రోజుకో పరిణామం చోటుచేసుకుంటోంది. అయితే ముఖ్యమంత్రి యడియూరప్ప మాత్రం మారడని ఆయన రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్యే రేణుకాచార్య కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. యడియూరప్ప సీఎం పదవికి రాజీనామా చేయాల్సిన అవసరమే లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రికి 65 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా యడియూరప్పకు వ్యతిరేకంగా పని చేస్తున్న వారిపై రేణుకాచార్య విరుచుకుపడ్డారు. వారి పక్క నియోజకవర్గాన్ని గెలిపించుకునే సత్తాలేనివారు యడియూరప్ప గురించి మాట్లాడుతుండడం వింతగా ఉందని పేర్కొన్నారు. యత్నాళ్‌ పిచ్చోడి తరహాలో మాట్లాడారని తెలిపారు. ఆయనకు వ్యతిరేకంగా ఏమి జరగదని చెప్పారు. వారం కిందట 18 మంది ఎమ్మెల్యేలు యడియూరప్పకు మద్దతుగా తాము ఢిల్లీకి వెళ్లి వస్తామని చెప్పారని.. అయితే ఏ సమస్య లేదని యడియూరప్ప చెప్పినట్లు’ రేణుకాచార్య వివరించారు. ఈ సమయంలో యడియూరప్ప రాజీనామా చేయాల్సిన అవసరమే లేదు అని స్పష్టం చేశారు. 

ప్రస్తుతం కరోనా తీవ్రంగా విజృంభిస్తున్న సమయంలోనూ యడియూరప్ప వృద్ధాప్యంలో చురుగ్గా పని చేస్తున్నారని రేణుకాచార్య తెలిపారు. కోవిడ్‌ సందర్భంలో కొందరు ఢిల్లీకి వెళ్లి ఏవేవో ప్రయత్నాలు చేయడం సరికాదని ప్రత్యర్థి గ్రూపులకు హితవు పలికారు. నాయకత్వ మార్పు వివాదం రేగిన నేపథ్యంలో యడియూరప్పకు మద్దతుగా 65 మందికి పైగా ఎమ్మెల్యేలు సంతకాలు చేశారని, దానికి సంబంధించిన లేఖ తన వద్ద ఉందని రేణుకాచార్య తెలిపారు.
 

చదవండి: కలకలం..ముఖ్యమంత్రిని పంపేందుకు ముహూర్తం పెట్టాం 

చదవండి: ‘సీఎంను మార్చే ప్రసక్తే లేదు.. అవి కేవలం పుకార్లే’

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు