దక్షిణాది బీజేపీలో ఏకైక మాస్‌ లీడర్‌.. ఆటుపోట్లెన్నో..!

27 Jul, 2021 08:17 IST|Sakshi
గవర్నర్‌కు రాజీనామా పత్రాలను సమర్పించి వస్తున్న యడియూరప్ప    

సుదీర్ఘంగా సాగిన యడియూరప్ప ప్రస్థానం

నాలుగుసార్లు కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం

ఒక్కసారి కూడా పూర్తికాలం అధికారం అనుభవించని వైనం

దక్షిణాదిలో తొలిసారిగా బీజేపీని గెలిపించిన నేతగా అరుదైన గుర్తింపు 

బెంగళూరు: దురదృష్టం అంటే ఇదేనేమో! కర్ణాటకలో ఇప్పటిదాకా ఏ నాయకుడికీ సాధ్యం కాని రీతిలో ఏకంగా నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బి.ఎస్‌.యడియూరప్ప(78) ఒక్కసారైనా పూర్తికాలం అధికారంలో కొనసాగలేకపోయారు. వరుసగా ఐదేళ్లు అధికారం అనుభవించలేకపోయారు. ఇందుకు ఒక్కటి కాదు.. ఎన్నెన్నో కారణాలున్నాయి. కర్ణాటకలో బీజేపీకి దశాబ్దాలపాటు పెద్ద దిక్కుగా ముద్రపడిన యడియూరప్ప రాజకీయ జీవితం ముగిసిపోయిందని ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. చదువు పూర్తయిన తర్వాత సాధారణ ప్రభుత్వ గుమాస్తాగా జీవితం ఆరంభించి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన యడియూరప్ప ప్రస్థానం ఆసక్తికరమే.

రాజకీయ జీవితంలో ఎదురైన ఎన్నో ఆటుపోట్లను తన చతురతతో సమర్థంగా ఎదుర్కొన్నారు. కానీ, మరో రెండేళ్ల పదవీ కాలం ఉండగానే కుర్చీ దిగిపోవాల్సి వచ్చింది. వయసు 75 ఏళ్లు దాటడం, 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా కొత్త నాయకత్వాన్ని తెరపైకి తీసుకురావాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించడంతో యడియూరప్ప తప్పుకోవాల్సి వచ్చింది. 75 ఏళ్లు దాటిన వారికి కీలక పదవులు అప్పగించరాదన్న నిబంధన బీజేపీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అవినీతి ఆరోపణలు, నియంతలా వ్యవహరించడం, కుమారుడు, కర్ణాటక బీజేపీ ఉపాధ్యక్షుడు విజయేంద్ర ప్రభుత్వ పరిపాలనలో మితిమీరి జోక్యం  వంటివి యడియూరప్ప నిష్క్రమణకు పైకి చెప్పని కారణాలు. దక్షిణాదిన ఉత్తరాది పార్టీ బీజేపీ అధికారంలోకి రావడం అసాధ్యమన్న జోస్యాలను అబద్ధం అని నిరూపించిన నేత యడియూరప్ప. దక్షిణాదిలో తొలిసారిగా బీజేపీ అధికారంలోకి రావడానికి బాటలు పరిచారు.

ఎన్నెన్నో మలుపులు..   
యడియూరప్పకు 2004లో ముఖ్యమంత్రి పదవి తృటిలో చేజారింది. 2004లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ, మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మంత్రాంగంతో కాంగ్రెస్, జేడీ(ఎస్‌) పొత్తు పెట్టుకున్నాయి. ధరంసింగ్‌ ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇక్కడే యడియూరప్ప తన చాతుర్యం ప్రదర్శించారు. 2006లో దేవెగౌడ కుమారుడు కుమారస్వామితో చేతులు కలిపారు. ధరంసింగ్‌ ప్రభుత్వాన్ని పడగొట్టారు. మిగిలి ఉన్న మూడేళ్ల పదవీ కాలాన్ని ఇద్దరూ సగం సంగం పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు ముఖ్యమంత్రి కావాలని ఒప్పందం చేసుకున్నారు. దీంతో తొలుత కుమారస్వామి సీఎం అయ్యారు. యడియూరప్ప తొలిసారిగా 2007 నవంబర్‌లో సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.

కానీ, కేవలం 7 రోజులకే రాజీనామా చేయాల్సి వచ్చింది. పొత్తు ఒప్పందం నుంచి కుమారస్వామి తప్పుకోవడమే ఇందుకు కారణం. 2008 మేలో రాష్ట్రంలో బీజేపీ గెలవడంతో యడియూరప్ప రెండోసారి సీఎం అయ్యారు. అక్రమ మైనింగ్‌  ఆరోపణలు రావడంతో 2011 జూలైలో రాజీనామా చేశారు. భూ కుంభకోణం కేసుల్లో యడియూరప్ప  అదే ఏడాది అక్టోబర్‌ 15న లోకాయుక్త కోర్టు ఎదుట లొంగిపోయారు. వారం  పాటు జైల్లో ఉండి విడుదలైన తర్వాత బీజేపీతో అనుబంధాన్ని తెంచుకున్నారు. ‘కర్ణాటక జనతా పక్ష’ పేరిట రాజకీయ పార్టీని స్థాపించి 2013 ఎన్నికల్లో పోటీ చేశారు. కేవలం 6 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నారు. తన పార్టీకి భవిష్యత్తు లేదని నిర్ధారణకు వచ్చి, 2014 జనవరి 9న బీజేపీలో విలీనం చేశారు. 2014లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ 28కి గాను 19 ఎంపీ సీట్లు గెలుచుకుంది.

దీంతో పార్టీలో యడియూరప్ప పరపతి పెరిగిపోయింది. 2016 అక్టోబర్‌ 26న ఆయనకు భారీ ఊరట లభించింది. అక్రమ మైనింగ్‌ కేసు, అవినీతి నిరోధక చట్టం కింద నమోదు చేసిన కేసుల నుంచి విముక్తి లభించింది. దీంతో 2016 ఏప్రిల్‌లోబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నాలుగోసారి నియమితులయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వం ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. అయితే, ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాలేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ యడియూరప్పను గవర్నర్‌ ఆహ్వానించారు. మెజార్టీ నిరూపణకు 15 రోజుల గడువు ఇచ్చారు.

అయితే, గవర్నర్‌ నిర్ణయంపై జేడీ(ఎస్‌) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో బల నిరూపణకు సుప్రీంకోర్టు యడియూరప్పకు కేవలం 24 గంటల గడువిచ్చింది. దీంతో యడియూరప్ప ప్రభుత్వం మెజార్జీ నిరూపించుకోలేక మూడు రోజులకే కుప్పకూలింది. జేడీ(ఎస్‌) నేత కుమారస్వామి సీఎం అయ్యారు. 17 మంది కాంగ్రెస్, జేడీ(ఎస్‌) ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో మెజార్టీ లేక 2019 జూలై 23న కుమారస్వామి సర్కారు కూలిపోయింది. వారి అండతో యడియూరప్ప 2019 జూలై 26న నాలుగోసారి సీఎంగా ప్రమాణం చేశారు.  రాజీనామా చేసిన 17 మంది ఎమ్మెల్యేలు యడియూరప్ప మద్దతుతో బీజేపీ టికెట్లపై ఉప ఎన్నికల్లో గెలిచారు. యడియూరప్ప మొత్తం నాలుగుసార్లు ముఖ్యమంత్రి కాగా, మొదటిసారి ఏడు రోజులు, రెండోసారి మూడేళ్ల రెండు నెలలు, మూడోసారి మూడు రోజులు, నాలుగోసారి సరిగ్గా రెండేళ్లు అధికారంలో కొనసాగారు.


దక్షిణాది బీజేపీలో ఏకైక మాస్‌ లీడర్‌
బీఏ చదివారు. ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ కాలంలో జైలు జీవితం అనుభవించారు. సామాజిక సంక్షేమ శాఖలో క్లర్క్‌గా ఉద్యోగ జీవితం ఆరంభించారు. కొంతకాలానికి రాజీనామా చేసి, శికారిపురాలో ఓ రైసు మిల్లులో క్లర్క్‌గా చేరారు. అక్కడ కూడా రాజీనామా చేసి, శివమొగ్గలో హార్డ్‌వేర్‌ దుకాణం ప్రారంభించారు. తాను క్లర్క్‌గా పనిచేసిన రైసు మిల్లు యజమాని కుమార్తె మైత్రాదేవిని 1967 మార్చి 5న వివాహం చేసుకున్నారు. యడియూరప్ప దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు రాఘవేంద్ర ప్రస్తుతం శివమొగ్గ ఎంపీ. రెండో కుమారుడు విజయేంద్ర కర్ణాటక బీజేపీ ఉపాధ్యక్షుడు. ఎల్లప్పుడూ తన ట్రేడ్‌మార్కు దుస్తులు తెల్ల రంగు సఫారీ ధరించే యడియూరప్పకు కన్నడ సినిమాలంటే చాలా ఇష్టం. దక్షిణ భారతదేశంలో ‘మాస్‌ లీడర్‌’ అన్న గుర్తింపు కలిగిన ఏకైక బీజేపీ నేత యడియూరప్ప కావడం గమనార్హం. కర్ణాటకలోని బలమైన వీరశైవ–లింగాయత్‌ సామాజికవర్గానికి చెందిన యడియూరప్పకు ఆ వర్గంలో గట్టి పట్టుంది. రాష్ట్రంలో లింగాయత్‌లు బీజేపీకి బలమైన మద్దతుదారులు. 

ముఖ్యమంత్రిగా.. ప్రతిపక్ష నేతగా
బుకనకెరె సిద్ధలింగప్ప యడియూరప్ప 1943 ఫిబ్రవరి 27న మండ్యా జిల్లాలోని కె.ఆర్‌.పేట తాలూకాలో బుకనకెరె గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు పుట్టతాయమ్మ, సిద్ధలింగప్ప. 15 ఏళ్లకే రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌)లో చేరారు. యడియూరప్పను అనుచరులు రాజా హులి(పులి రాజా) అని పిలుచుకొనేవారు. శివమొగ్గ జిల్లాలోని సొంత పట్టణం శికారిపురాలో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలయ్యింది. బీజేపీ మాతృసంస్థ అయిన జనసంఘ్‌లో చేరారు. 1970వ దశకంలో శికారిపురా తాలూకా జనసంఘ్‌ అధినేతగా పనిచేశారు. శికారిపురా పురసభ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1983లో తొలిసారిగా శికారిపురా ఎమ్మెల్యేగా గెలిచారు. అదే నియోజకవర్గం నుంచి  8సార్లు ఎమ్మెల్యేగా నెగ్గడం విశేషం. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగానే కాదు శానసభలో ప్రతిపక్ష నేతగా, ఎమ్మెల్సీగా, ఒకసారి ఎంపీగానూ పనిచేశారు. 

>
మరిన్ని వార్తలు