ఎనిమిదేళ్లలో రూ.5 లక్షల కోట్ల అప్పు 

26 Sep, 2022 01:35 IST|Sakshi
వ్యాపారులను ఓటు అభ్యర్థిస్తున్న ప్రవీణ్‌కుమార్‌ 

కేసీఆర్‌ పాలనపై ధ్వజమెత్తిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌ 

చౌటుప్పల్‌: కేసీఆర్‌ తన ఎనిమిదేళ్ల పాలనలో రూ.5 లక్షల కోట్ల అప్పు చేశారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ధ్వజమెత్తారు. బీఎస్పీ ఆధ్వర్యంలో చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర ఆదివారం యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం, చౌటుప్పల్, తంగడపల్లి గ్రామాల మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా చిరు వ్యాపారులు, వివిధ రంగాల కార్మికులతో ఆయన ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మార్గమధ్యంలో చాకలి ఐలమ్మ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్, సర్దార్‌ సర్వాయి పాపన్నల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం, మిషన్‌ భగీరథ వంటి స్కీంలతో సీఎం కేసీఆర్‌ కోట్లు సంపాదించారని ఆరోపించారు. కేసీఆర్‌ తెచ్చేవి స్కీంలు కాదని, అన్నీ స్కాంలేనని అన్నారు. స్కీంల ద్వారా పేదల పేరు చెప్పుకొని టీఆర్‌ఎస్‌ నాయకులు జేబులు నింపుకుంటున్నారని మండిపడ్డారు. ఓట్ల కోసం నాసిరకం బతుకమ్మ చీరలు పంచుతూ మహిళలను అవమానపరుస్తున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశాన్ని గుజరాత్‌ షేఠ్‌లకు అమ్ముతోందని ధ్వజమెత్తారు. మునుగోడు ఎన్నికల కోసం కేంద్రహోంమంత్రి అమిత్‌ షా తాజా మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి రూ.150 కోట్లు ఇచ్చారని ఆయన ధ్వజమెత్తారు.

మరిన్ని వార్తలు