అసలు ఇదేం బడ్జెట్‌: మమత మండిపాటు

1 Feb, 2021 16:55 IST|Sakshi

కోల్‌కతా: ‘‘అసలు ఇదేం బడ్జెట్‌.. ఇదో నకిలీ బడ్జెట్‌. రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక.. దేశ వ్యతిరేక బడ్జెట్‌ ఇది. పెట్రోలు, డీజిల్‌ ధరలు పెంచారు. సెస్‌లు విధించారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌తో రాష్ట్ర ప్రభుత్వానికి ఒరిగేదేమీ లేదు. రైతులు నష్టపోతారు. 15 లక్షల రూపాయలు ఇస్తామని మాయమాటలు చెప్పారు. ఇప్పుడేం జరిగింది’’ అంటూ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

కాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ 2021-22 బడ్జెట్‌ను సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన మమతా బెనర్జీ ఉత్తర బెంగాల్‌ పర్యటనలో భాగంగా మాట్లాడుతూ.. ‘‘బీఎస్‌ఎన్‌ఎల్‌, రైల్వే, ఎయిర్‌ ఇండియా, పీఎస్‌యూలు ప్రైవేటీకరణ చేశారు. దీంతో ఉద్యోగాలకు గ్యారెంటీ లేకుండా పోయింది. ఈ బడ్జెట్‌ ఎలా ఉందని మన రాష్ట్ర ఆర్థిక మంత్రి అమిత్‌ మిత్రాను అడిగాను. మాటలతో ప్రజలను మభ్యపెట్టి మసిపూసి మారేడుకాయ చేసేలా ఉందని చెప్పారు’’ అని నరేంద్ర మోదీ సర్కారు తీరును విమర్శించారు.(చదవండి: బడ్జెట్‌ 2021: ప్రధాని మోదీ స్పందన)

అదే విధంగా, బీజేపీకి చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోవడం అలవాటు లేదని, కేవలం అబద్ధాలు ప్రచారం చేసి పబ్బం గడుపుకుంటారంటూ మండిపడ్డారు. కాగా బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, టీఎంసీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మౌలిక వసతుల కల్పన, రోడ్ల అభివృద్ధికి బడ్జెట్‌లో కేంద్రం భారీగా నిధులు కేటాయించడం విశేషం. మొత్తం రాష్ట్రానికి దాదాపు 95 వేల కోట్ల వరకు బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేసింది. 

మరిన్ని వార్తలు