బీసీల ద్రోహి చంద్రబాబు 

23 Sep, 2022 04:53 IST|Sakshi

డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ధ్వజం 

సంక్షేమ పథకాలు, రాజ్యాధికారంలో బీసీలకు సీఎం జగన్‌ పెద్దపీట

సాక్షి, అమరావతి: బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుని వదిలేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చరిత్రలో బలహీన వర్గాల ద్రోహిగా నిలిచిపోతారని డిప్యూటీ సీఎం (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయుడు మండిపడ్డారు. కనుచూపు మేరలో ఎన్నికలు కనిపిస్తుండటంతో బాబుకు మళ్లీ బీసీలు గుర్తుకొస్తున్నారని దుయ్యబట్టారు.

సంక్షేమ పథకాల ద్వారా బీసీ వర్గాలకు ఆర్థిక స్వావలంబన, రాజ్యాధికారంలో భాగస్వామ్యం ద్వారా సామాజిక సాధికారత దిశగా సీఎం జగన్‌ బాటలు వేశారని చెప్పారు. బీసీలను చంద్రబాబు బ్యాక్‌ వర్డ్‌ క్లాస్‌గా భావిస్తే బ్యాక్‌ బోన్‌ క్లాస్‌గా సీఎం జగన్‌ మార్చారని తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 

► ఉమ్మడి రాష్ట్రంలో 1999 ఎన్నికల ముందు ఓట్ల కోసం రజకులకు నాలుగు ఇస్త్రీ పెట్టెలు, నాయీ బ్రాహ్మణులకు కత్తెరలు, శెట్టి బలిజ, గీత కార్మీకులకు మోకులు ఇవ్వటం మినహా బీసీలకు చంద్రబాబు ఏం చేశారు? 

► బీసీలకు ఏటా రూ.10 వేల కోట్లు, ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు ఇస్తామని 2014 ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ప్రకటించిన చంద్రబాబు ఐదేళ్లలో ఏమీ ఇవ్వకుండా మోసం చేశారు. 

► బీసీలకు తొలుత న్యాయం జరిగింది దివంగత వైఎస్సార్‌ హయాంలోనే. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లాంటి పథకాల ద్వారా బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కూడా ఆదుకున్నారు. నిరుపేద కుటుంబాల పిల్లలు ఉన్నత చదువులు చదివితేనే వారి బతుకులు మారతాయని ఆయన గట్టిగా నమ్మారు. సామాన్యులు కూడా కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందేలా ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారు. చంద్రబాబు ఏనాడైనా ఆ కోణంలో ఆలోచించారా? కనీసం ఒక్కటైనా అమలు చేశారా? 

► పాదయాత్రలో పేదల కష్టాలను స్వయంగా చూసిన సీఎం జగన్‌ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల  కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు. అమ్మ ఒడి పథకం, విద్యాదీవెన, విద్యాకానుక, పొదుపు మహిళలకు ఆసరా, అక్కచెల్లెమ్మలకు చేయూత లాంటి పథకాలను దేశంలో ఎక్కడా లేని విధంగా అమలు చేస్తున్నారు. 

► బీసీలకు రాజకీయంగా, ఆరి్థకంగా అండగా నిలుస్తూ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏకంగా నలుగురు బీసీలను రాజ్యసభకు ఎంపిక చేశారు.  

► బీసీల సంక్షేమం కోసం ఏకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు బీసీల్లో మొత్తం కులాలు, ఉప కులాలను గుర్తించేందుకు అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారు.  

► ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి సీఎం పదవిని చంద్రబాబు లాక్కున్నారు. చివరకు ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించిన చరిత్ర చంద్రబాబుది. అలాంటి వ్యక్తి ఇవాళ రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్టీఆర్ను దేవుడు అంటున్నారు.   

► తనకు ఇక రాజకీయ భవిష్యత్తు లేదని చంద్రబాబుకు తెలుసు. కుప్పంలో పోటీ చేసే శక్తి, సామర్థ్యం ఆయనకు లేవు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయం. 

మరిన్ని వార్తలు