గ్రామాల్లో అభివృద్ధి కనిపించటం లేదా? 

9 Oct, 2022 05:07 IST|Sakshi

బాగుపడ్డ స్కూళ్లు, ఇంగ్లిష్‌ మీడియం, డిజిటల్‌ క్లాస్‌లు గతంలో ఉన్నాయా? 

పంచాయతీకి రూ.20 లక్షల చొప్పున బడ్జెట్‌ నుంచి 3వేల కోట్లు ఇస్తున్నాం 

పంచాయతీల విద్యుత్‌ బకాయిలు చెల్లించటం కూడా నేరమేనా?

టీడీపీపై మంత్రి ముత్యాలనాయుడు మండిపాటు

విశాఖపట్నం (దొండపర్తి): ఒకవైపు గ్రామాల్లో అభివృద్ధి కనిపిస్తుండటంతో పంచాయతీల విషయంలో ఏ రకంగా దుష్ప్రచారం చేయాలో తెలియక ‘ఈనాడు’ పత్రిక ఇష్టానుసారం కథనాలు రాస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. పంచాయతీల నిధులు మళ్లించారంటూ... పీడీ ఖాతాల్లో జమ చేశారం టూ... విద్యుత్‌ బకాయిలు చెల్లించేస్తున్నారంటూ పొంతన లేని కథనాలు రాయడంపై ఆయన మండిపడ్డారు.

స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాన్ని ఎలాగైనా అప్రదిష్టపాలు చేసి, చంద్రబాబును మళ్లీ సీఎంను చేయాలన్న తాపత్రయంతో పచ్చ పత్రికలు తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నాయని మండిపడ్డారు. ‘ఊళ్లలో ఇంతకు ముందెన్నడూ లేని అభివృద్ధి జరుగుతోంది. కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లు కొత్త రూపం తెచ్చుకున్నాయి. ఊరికి ఇంగ్లిష్‌ మీడియం చదువులు, డిజిటల్‌ క్లాస్‌రూమ్‌లు వచ్చాయి.

అదే ఊళ్లో కాస్త ముందుకెళితే నిత్యం కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు అందుబాటులో ఉండే విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ కనిపిస్తోంది. అక్కడే పరీక్షలు చేయటంతో పాటు ఇంకాస్త మెరుగైన చికిత్స అవసరమనిపిస్తే వాళ్లే టెలీ కన్సల్టింగ్‌ చేయిస్తున్నారు. అదే ఊళ్లో రైతు అవసరాలు తీర్చే ఆర్‌బీకే, దూరాభారాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామ సచివాలయం అన్నీ కనిపిస్తున్నాయి.

వీటన్నిటి విలువ దాదాపు 40 లక్షల కోట్ల రూపాయలు. గ్రామాల్లో ఇంత అభివృద్ధిని గతంలో కనీసం ఊహించారా? వీటన్నిటినీ తట్టుకోలేక రాష్ట్రంలో కేవలం 10 శాతం ఉన్న టీడీపీ సర్పంచ్‌లను రోడ్డు మీదకు తీసుకువచ్చి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని జనం గ్రహించలేదనుకుంటున్నారా?’’ అని మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు.  

దివాళాకోరు తనానికి నిదర్శనం
మొన్నటిదాకా పంచాయతీల ఖాతాల్లోకి నిధులింకా జమ చేయలేదని, వాటన్నిటినీ మళ్లించేశారని రాసిన ‘ఈనాడు’... ఇపుడు పీడీ ఖాతాల్లో వేశాక కూడా ఆందోళనలంటూ వార్తలు రాయటం దివాలాకోరుతనానికి నిదర్శనమని ముత్యాలనాయుడు వ్యాఖ్యానించారు. ‘గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కూడా గతంలోకన్నా ఇప్పుడే ఎక్కువ జరుగుతున్నాయి. ఉపాధి హామీ నిధులు కాకుండా, కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులు కాకుండా రాష్ట్ర బడ్జెట్‌ నుంచి సొంతంగా పంచాయతీకి రూ.20 లక్షల చొప్పున దాదాపు రూ.3,000 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నాం.

గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, ఇతర అవసరాల నిమిత్తం ఇస్తున్న ఈ నిధులను గ్రామ అవసరాలకు అనుగుణంగా ఖర్చుచేయాల్సిన బాధ్యత, చేసే అధికారం సర్పంచులకే ఉంది’ అని వివరించారు. గ్రామాల్లో ఇంత అభివృద్ధి జరుగుతోంది కాబట్టే తెలుగుదేశం, దాని మిత్రపక్ష మీడియా జీర్ణించుకోలేకపోతోందన్నారు.  పంచాయతీల విద్యుత్‌ బకాయిలు చెల్లించడాన్ని కూడా ఏదో తప్పు చేస్తున్నట్లుగా చూపించడాన్ని  విమర్శించారు. ‘పంచాయతీలు విద్యుత్‌ బిల్లులు చెల్లించకుండా డిస్కంలకు బకాయి పడ్డాయి.

వాటిని తీర్చాలి కదా? డిస్కంలు కూడా పనిచేయాలి కదా? అవి ఆర్థికంగా బాగుంటేనే కదా రాష్ట్రానికి కరెంట్‌ ఇవ్వగలిగేది? ఈ మాత్రం కూడా తెలియనట్లుగా పనికిమాలిన విమర్శలు చేస్తే ఎలా? విద్యుత్‌ బిల్లుల బకాయిలు చెల్లించటం నేరమా? మొన్నటిదాకా డబ్బులు వేయలేదని, మళ్లించేశారని రాశారు. ఇప్పుడు పీడీ ఖాతాల్లో డిపాజిట్‌ చేశారు కదా? ఇది కూడా తప్పేనంటారా’ అని ప్రశ్నించారు. విద్యుత్‌ బకాయిలు చెల్లించాలని కేంద్రమే పేర్కొన్నదని గుర్తుచేశారు. చంద్రబాబు డిస్కంలను గాలికి వదిలేసి నిధులన్నీ మళ్లించేశారని, తమ ప్రభుత్వం వచ్చాకే బకాయిలు చెల్లిస్తూ డిస్కంలను గాడిలో పెడుతోందని వివరించారు. 

మరిన్ని వార్తలు