అసెంబ్లీ సాక్షిగా బుక్కైన టీడీపీ నేతలు, ఎల్లో మీడియా.. ఇప్పుడేమంటారో?

15 Mar, 2023 21:10 IST|Sakshi

అసెంబ్లీ సాక్షిగా టీడీపీ బండారం బయటపడింది. ఎల్లో మీడియా ఫేక్‌ ప్రచారానికి అసెంబ్లీ వేదికగా మంత్రి బుగ్గన చెక్‌ పెట్టారు. దీంతో ఎల్లో బ్యాచ్‌..  ఒక్కసారి షాకై నోరు మూసుకున్నారు. చెరపకురా చెడేవు.. అన్న సామెత పచ్చ బ్యాచ్‌ పక్కాగా సూట్‌ అవుతుంది. లేనది ఉన్నట్టు చూపించి నమ్మించాలనే వారి ఐడియాలు ఎప్పుడూ తుస్సుమంటూనే ఉన్నాయి. దీంతో, ఖంగుతినడం పరిపాటిగా మారిపోయింది. అయినప్పటికీ ఫేక్‌ ప్రచారం మాత్రం ఆగడం లేదు. 

అయితే, అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వాగతం పలకలేదని ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాసుకొచ్చింది. దీనికి టీడీపీ సభ్యులు వంత పాడారు. దీంతో, ఎల్లో మీడియా ఫేక్‌ ప్రచారాన్ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఖండించారు. ఈ క్రమంలో టీడీపీ తప్పుడు ప్రచారాలకు వీడియోలతో సహా చెక్‌ పెట్టారు. అసలు వాస్తవాలను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ బయటపెట్టారు. అసత్య ప్రచారాలపై ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయాలని.. కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాంను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కోరారు. 

కాగా, గవర్నర్‌కు స్వాగతం పలుకుతున్న వీడియోను మంత్రి బుగ్గన.. అసెంబ్లీలో ప్లే చేశారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో మంత్రి ఈ అంశాన్ని ప్రస్తావించారు. గవర్నర్ ప్రసంగంపై ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని వీడియోతో సహా చూపించారు. టీడీపీవీ అన్ని తప్పుడు ఆరోపణలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌కు మేము ఇచ్చినంత మర్యాద ఎవరూ ఇవ్వలేదన్నారు. గవర్నర్‌కు ఏవిధంగా సీఎం జగన్‌ స్వాగతం పలికారో వీడియోలో చూపించారు. దీంతో, టీడీపీ నేతల బండారం బయటపడింది. 

అనంతరం, స్పీకర్‌ తమ్మినేని కూడా ప్రోటోకాల్‌ ప్రకారమే.. గవర్నర్‌ నజీర్‌ను సీఎం జగన్‌ స్వాగతం పలికారని చెప్పారు. దీనికి ఆయనే ప్రత్యక్ష సాక్షినని స్పష్టం చేశారు. మరోవైపు.. రాజ్యాంగ వ్యవస్థలపై బురద చల్లేలా టీడీపీ సభ్యులు, ఈనాడు వ్యవహరిస్తున్నాయని ఈ అంశాన్ని ప్రివిలేజ్‌ కమిటీకి రిఫర్‌ చేయాలని శాసనసభ వ్యవహారాల మంత్రికి స్పీకర్‌ సూచించారు. ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నట్టు తెలిపారు. తప్పుడు ప్రచారాలపై తప్పకుండా చర్యలుంటాయని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు