నవరత్నాలకు దండిగా నిధులు

3 Dec, 2020 04:12 IST|Sakshi

సంక్షేమ పథకాల అమలు కోసమే తపన 

అందుకే ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట సవరణ మంత్రి బుగ్గన  

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నవరత్నాలకు ఎలాంటి నిధుల సమస్య రాకుండా చట్ట సవరణలు తెచ్చినట్టు ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ బుధవారం శాసనసభలో తెలిపారు. మనబడి, ఆస్పత్రులు, అమ్మ ఒడి, రైతుభరోసా, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ చేయూత పథకాల అమలుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేస్తున్నట్టు చెప్పారు. ఏపీ అభివృద్ధి సంస్థ బిల్లును, ఏపీ విత్త బాధ్యత, బడ్జెట్‌ నిర్వహణ సవరణ (ఫిస్కల్‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌ – ఎఫ్‌ఆర్‌బీఎం) బిల్లును సభ ఆమోదించింది. ఈ సందర్భంగా ఆయన  ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట సవరణ ఉద్దేశాలను వివరించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి ప్రకారం 3 శాతం మాత్రమే అప్పుచేసే అవకాశం ఉందని, మన వడ్డీ, మనకు ఉన్న రెవెన్యూ రశీదులు 10 శాతం ఉంటే అప్పు చేయవచ్చని తెలిపారు. ఆర్థికసంఘం సిఫార్సుల మేరకు సవరణలు చేస్తున్నట్టు చెప్పారు. దీనికి అనుగుణంగా అప్పు చేసుకునే వెసులుబాటు పరిధి పెరుగుతుందని తెలిపారు. కోవిడ్‌ కారణంగా ఈ సవరణలు చేయాల్సి వస్తోందన్నారు. ఇప్పటికే కేంద్రం 2 శాతానికి అనుమతించిందని చెప్పారు. 

కమీషన్లకు కక్కుర్తిపడి ‘పోలవరం’పై రాజీపడ్డ చంద్రబాబు 
పోలవరంపై చర్చ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ చంద్రబాబుది ఆర్భాటపు, ఆవేశపు, అసమర్థ ప్రభుత్వమని, తమది సహనం ఉన్న సమర్థ ప్రభుత్వమని చెప్పారు. చంద్రబాబు కమీషన్ల కోసం ప్యాకేజీకి కక్కుర్తిపడి ప్రత్యేక హోదా అంశంతోపాటు పోలవరం ప్రాజెక్టుపై రాజీపడ్డారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం చేసిన ఆ దుర్మార్గపు చర్యే ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుకు ఎన్నో సమస్యలను తీసుకువచ్చిందన్నారు. 2014లో కేంద్రం గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌గా పోలవరం నిర్మిస్తామన్న కేంద్రం 2016 సెపె్టంబర్‌లో మాత్రం.. 2014 నాటి ధరలమేరకే భరిస్తామంటే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం తెలపలేదని ప్రశ్నించారు. పైగా 2018 జనవరి 12న అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రధాని మోదీకి లేఖ రాస్తూ 2014 నాటి ధరల ప్రకారం నివేదిక సమర్పించాం.. దాన్ని ఆమోదించాలని కోరడం ఏమిటని నిలదీశారు. 27 సార్లు ఢిల్లీ వెళ్లానని గొప్పగా చెప్పుకున్న చంద్రబాబు పోలవరం విషయంలో కేంద్రం నిర్ణయాన్ని ఎందుకు అడ్డుకోలేదని, ఆనాడు  కేంద్రంలో ఉన్న టీడీపీ మంత్రులు కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు. ఆనాటి టీడీపీ ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దుతూ పోలవరం ప్రాజెక్టు పూర్తికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందని, ప్రాజెక్టును పూర్తి చేసితీరతామని ఆయన చెప్పారు.   

మరిన్ని వార్తలు