చంద్రబాబు వేసిన చిక్కుముడులు విప్పుతున్నాం

12 Dec, 2020 04:30 IST|Sakshi
షెకావత్‌కు వినతిపత్రం ఇస్తున్న బుగ్గన, అనిల్‌

సవరించిన పోలవరం అంచనాల ఆమోదానికి కేంద్రం సానుకూలం

రాష్ట్ర మంత్రులు బుగ్గన, అనిల్‌కుమార్‌ వెల్లడి

15 రోజుల్లో కేంద్ర జలశక్తిమంత్రి పోలవరం పర్యటన

సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేసిన చిక్కుముడులు ఒక్కొక్కటిగా విప్పుతున్నామని, దానికోసం కసరత్తు చేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌యాదవ్‌ చెప్పారు. సవరించిన అంచనాలు ఆమోదానికి కేంద్రం సానుకూలంగా ఉందన్నారు. శుక్రవారం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో బుగ్గన రాజేంద్రనాథ్, అనిల్‌కుమార్‌ భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలు ఆమోదించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. అనంతరం రాష్ట్ర మంత్రులు మీడియాతో మాట్లాడారు. తొలుత మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. మూడు రోజులుగా కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల మంత్రులు, అధికారులతో ఆర్థిక మంత్రి బుగ్గన, రాష్ట్ర అధికారులు భేటీ అయ్యారని తెలిపారు.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇచ్చిన వినతిపత్రం కేంద్రమంత్రికి అందజేశామన్నారు. చంద్రబాబు హయాంలో చేసిన పొరపాట్లు, దరిమిలా పోలవరం ప్రాజెక్టుకు వస్తున్న ఇబ్బందులు కేంద్రమంత్రికి వివరించామన్నారు. ఆ అంశాలపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని షెకావత్‌ తెలిపారన్నారు. పోలవరం ప్రాజెక్టులో తాగునీటికి సంబంధించి కాంపొనెంట్‌ తీసేశారని, విభజన చట్టం ప్రకారం ఇవ్వాలని కోరామన్నారు. సవరించిన అంచనాల ప్రకారం ఆర్‌అండ్‌ఆర్‌కు అవసరమైన నిధులు ఇవ్వాలని కోరామన్నారు. వీటికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని, కచ్చితంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలసంఘంతో సమన్వయం చేసుకొని ముందుకెళ్తామని చెప్పారన్నారు. పోలవరం ప్రాజెక్టు, ఆర్‌అండ్‌ఆర్‌ పనుల పరిశీలనకు రావాలని కోరగా.. 15 రోజుల్లోగా పోలవరం సందర్శిస్తానని షెకావత్‌ హామీ ఇచ్చారని అనిల్‌ తెలిపారు.  

సకాలంలో పూర్తి చేయడమే లక్ష్యం
బుగ్గన రాజేంద్రనాథ్‌ మాట్లాడుతూ.. విభజన చట్టంలో జాతీయ ప్రాజెక్టుగా పేర్కొన్న పోలవరంను సకాలంలో పూర్తి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. చంద్రబాబు హయాంలో ప్రత్యేక ప్యాకేజీ పేరుతో కుదుర్చుకున్న ఒప్పందం వల్ల వచ్చిన సమస్యలన్నింటినీ కేంద్రమంత్రికి వివరించామన్నారు. పోలవరానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పలుమార్లు చెప్పడాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. సమావేశంలో కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం, కేంద్ర అధికారులు, రాష్ట్ర అధికారులు ఎస్‌ఎస్‌రావత్, ఆదిత్యనాథ్‌ దాస్, ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ భావనా సక్సేనా తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు