అనవసర అప్పులన్నీ టీడీపీ హయాంలోనే..

27 Jul, 2022 04:49 IST|Sakshi
నీతిఆయోగ్‌ వైస్‌చైర్మన్‌ సుమన్‌ బెరిని కలిసిన ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌

మా ప్రభుత్వం పరిమితికి మించి అప్పులు చేయలేదు 

ద్రవ్యలోటు మూడు శాతానికి తగ్గించినా దుష్ప్రచారమే

గణాంకాలతో వివరించిన ఏపీ ఆర్థికమంత్రి రాజేంద్రనాథ్‌

సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ హయాంలోనే రాష్ట్రానికి అనవసర అప్పులు చేశారని ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ చెప్పారు. తమ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పరిమితికి మించి ఏనాడూ అప్పులు చేయలేదని స్పష్టం చేశారు. ఏపీ వెనకబాటుతనానికి చంద్రబాబే కారణమన్నారు. రాష్ట్రంలో ద్రవ్యలోటు, రుణాలు అంటూ టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా చేస్తున్న ఆరోపణలు, విమర్శలను ఆయన ఖండించారు. దేశంలో ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే ఎక్కువ అప్పులు చేస్తున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని, మనకంటే ఇతర రాష్ట్రాలు ఇంకా ఎక్కువ రుణం తీసుకుంటున్నాయని గణాంకాలతో సహా వివరించారు.

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో ద్రవ్యలోటు కూడా తక్కువేనన్నారు. ఆయన మంగళవారం న్యూఢిల్లీలోని ఏపీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అప్పులపై ప్రజల్లో భయం కలిగించాలని ఎల్లో మీడియా ప్రయత్నిస్తోందని విమర్శించారు. వాస్తవానికి పార్లమెంటులో అడిగిన ప్రశ్న ఆంధ్రప్రదేశ్‌ అప్పులపై కాదని, అయినా టీవీ చానళ్లు స్క్రోలింగ్స్, ఇంటర్వ్యూలు, చర్చల ద్వారా ప్రజల్లో భయం సృష్టించాలని చూశాయని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

బాబు పాలనలో అప్పు 140% పెరిగింది
‘2014–19 మధ్యలో అప్పటి టీడీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసింది. మా ప్రభుత్వం వచ్చాక 2019 నుంచి ఆర్థిక సమస్యలు, తర్వాత కోవిడ్‌తో మరిన్ని ఇబ్బందులు వచ్చినా సామాన్య మానవుడిని కాపాడుకునేందుకు కృషిచే స్తున్నాం. ఈ విషయంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో నిబద్ధతతో ఉన్నారు. విభజన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్‌కు 2014లో ఉన్న అప్పు రూ.1.35 లక్షల కోట్ల నుంచి 2019 మే నాటికి రూ.3.27 లక్షల కోట్లకు చేరింది. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అప్పు 140% పెరిగింది. మా ప్రభుత్వం వచ్చేనాటికి.. అంటే 2019 మే నెలలో రాష్ట్ర అప్పు రూ.3.27 లక్షల కోట్లు.

అది మూడేళ్ల తర్వాత రూ.4.98 లక్షల కోట్లకు పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌ అప్పులు 2020లో రూ.3,07,671 కోట్లు, 2021లో రూ.3,60,333 కోట్లు, 2022లో రూ.3,98,903 కోట్లు. ఏటా సగటున కర్ణాటక అప్పులు రూ.60 వేల కోట్లు, కేరళ అప్పులు రూ.45 వేల కోట్లు, తమిళనాడు అప్పులు రూ.లక్ష కోట్లు, తెలంగాణ అప్పులు రూ.45 వేల కోట్ల వంతున పెరిగాయి. జనాభా ప్రకారం చూసినా, స్థూల ఉత్పత్తి ప్రకారం చూసినా ఏపీ అప్పు తక్కువే. స్థూల ఉత్పత్తి మీద రాష్ట్రాల అప్పు నిష్పత్తిగా చూసినా ఏపీ భేష్‌.

అప్పులు కూడా టీడీపీ తెచ్చిన వడ్డీకంటే తక్కువకే తీసుకున్నాం. 2014–19 మధ్య కాలంలో కోవిడ్‌ వంటి సంక్షోభం లేకపోయినా చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల 4% ద్రవ్యలోటు నమోదైంది. కోవిడ్‌ సంక్షోభంలో కూడా మా ప్రభుత్వం ద్రవ్యలోటును 3% కి పరిమితం చేసింది. ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు విషయాల్లో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ బెటర్‌. దేశంలో బాగా పనిచేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ కూడా ఒకటని గర్వంగా చెప్పవచ్చు.
 
చంద్రబాబు ‘మనసులో మాట’ చదవాలి
ఉద్యోగులు చంద్రబాబు ‘మనసులో మాట’ పుస్తకాన్ని చదవాలి. శాశ్వత ఉద్యోగాలు వద్దు అని, 60% ఉద్యోగులు అవినీతి పరులని చంద్రబాబు ఆ పుసక్తంలో రాశారు. ప్రాజెక్టులు కడితే లాభం లేదని, సబ్సిడీలు పులి మీద సవారీ అని, ఉచిత సేవలు వద్దేవద్దని రాశారు..’ అని బుగ్గన చెప్పారు. అంతకుముందు ఆయన నీతి ఆయోగ్‌ వైస్‌చైర్మన్‌ సుమన్‌ బెరిని కలిశారు.  

మరిన్ని వార్తలు