టీడీపీ తప్పిదాలే పోలవరానికి శాపాలు

7 Nov, 2020 04:29 IST|Sakshi
నిర్మలా సీతారామన్‌తో సమావేశమైన బుగ్గన

కేంద్రం సమీక్షించాలని కోరాం: రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ

సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ హయాంలో చేసిన తప్పిదాలే నేడు పోలవరానికి శాపాలుగా పరిణమించాయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుపై 2013–14 లెక్కలకే పరిమితమవుతామని, ఆపై ఖర్చును రాష్ట్రమే భరిస్తుందని కేంద్రంతో నాడు టీడీపీ ఒప్పందం చేసుకుందని చెప్పారు. శుక్రవారం కేంద్ర ఆర్థిక  మంత్రి నిర్మలా సీతారామన్‌తో సుమారు 45 నిమిషాలపాటు సమావేశమైన మంత్రి బుగ్గన పోలవరం విషయంలో టీడీపీ సర్కారు నిర్వాకాలను వివరించారు. అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడారు. పోలవరం కోసం రాష్ట్రం ఖర్చు చేసిన రూ.4 వేల కోట్లు రీయింబర్స్‌ చేయాలని గత వారం కోరగా రూ.2,300 కోట్లు విడుదలకు కేంద్రం అనుమతించడంపై ధన్యవాదాలు తెలియ చేసినట్లు చెప్పారు.  

టీడీపీ సర్కారు తప్పిదాలను సరిదిద్దాలి.. 
‘పోలవరం నిర్మాణ వ్యయంపై 2013–14 అంచనాలకే పరిమితం అవుతూ 2017లో టీడీపీ సర్కారు కేంద్రంతో ఒప్పందం చేసుకుంది. ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు, పునరావాస వ్యయం, కమాండ్‌ ఏరియా ఖర్చు పెరిగే అవకాశం ఉంది కాబట్టి కేంద్రమే భరించాలని 2014లోఎన్డీయే ప్రభుత్వం తీర్మానం చేయగా.. 2013–14 ఖర్చులు చాలని, అంతకు మించితే రాష్ట్రం భరిస్తుందని టీడీపీ సర్కారు నాడు ఒప్పందం చేసుకుంది. కేవలం భూసేకరణకే రూ.17 వేల కోట్లకుపైగా ఖర్చవుతుంది. భూసేకరణ వివరాలు, నిర్వాసిత కుటుంబాలు, సవరించిన అంచనాలు, కమిటీ నివేదికలను కేంద్ర మంత్రి సీతారామన్‌కు అందజేశాం. గత సర్కారు తప్పిదాలను సరిదిద్దాలని, కేంద్రం సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని వివరించాం.  2013–14లో లక్ష ఎకరాలు భూ సేకరణ చేయాలని అంచనా వేయగా అదిప్పుడు లక్షన్నర ఎకరాలు అయింది’ అని బుగ్గన తెలిపారు.   

మరిన్ని వార్తలు