చట్టసభలకు ఆ హక్కు ఉంది

25 Mar, 2022 03:14 IST|Sakshi

అసెంబ్లీలో ఆర్థికమంత్రి బుగ్గన

సాక్షి, అమరావతి: విస్తృత ప్రజాప్రయోజనాల దృష్ట్యా పరిస్థితులకు అనుగుణంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకునే హక్కును రాజ్యాంగం చట్టసభలకు కల్పించిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. అసెంబ్లీలో గురువారం ఆయన మాట్లాడుతూ.. ప్రాంతాల మధ్య అసమానతలను రూపుమాపేలా రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకెళ్తున్నామన్నారు. 1910 నుంచి ఎన్నో మహాసభలు, పెద్ద మనుషుల ఒప్పందాలు, శివరామకృష్ణన్, శ్రీకృష్ణ, కేటీ రవీంద్రన్‌ కమిటీ సిఫార్సుల ఔన్నత్యానికి అనుగుణంగానే పరిపాలన వికేంద్రీకరణ చేపట్టామన్నారు. ఒకసారి చేసిన చట్టాన్ని మార్పు చేయకూడదంటే చట్టసభల అధికారాలు ప్రశ్నార్థకంలో పడతాయన్నారు. చట్టాల విషయంలో శాసన వ్యవస్థకు సర్వాధికారాలు ఉంటాయన్నారు. ప్రతి వ్యవస్థకు స్వీయ నియంత్రణ అవసరమని.. చట్టసభల నిర్ణయాధికారాలపై న్యాయ వ్యవస్థలు సమీక్షించడం, సూచనలు ఇవ్వడం వరకే పరిమితమైతే వ్యవస్థలు చక్కగా నడుస్తాయన్నారు. 

అసమానతల్లేని సమాజం నిర్మించాలని..
తెలంగాణ కంటే రాయలసీమ, ఉత్తరాంధ్ర ఆర్థిక, సామాజిక, విద్య, వైద్యం, నీటి వసతిలో వెనుకబడిన ప్రాంతాలుగా శ్రీకృష్ణ కమిటీ ఆనాడే చెప్పింది. చిన్నపిల్లల మరణాలు తెలంగాణ కంటే ఇక్కడే ఎక్కువగా ఉన్నాయని, ప్రగతికి సూచిగా చెప్పే విద్యుత్‌ వినియోగం కూడా తక్కువగా ఉందని ఆ నివేదికలో పేర్కొన్నారు. అసమానతలు లేని సమాజాన్ని నిర్మించాలన్న రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్తూ వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నాం. 

సీమలో కరువు.. ఉత్తరాంధ్రలో తుపాన్లు
రాయలసీమలో శాశ్వత కరువులు, ఉత్తరాంధ్ర శాశ్వత తుపానులతో ఏళ్లుగా కొట్టుమిట్టాడాయి. 1972లో కేంద్రం కూడా సీమ జిల్లాలను పూర్తి కరువు పీడిత ప్రాంతాలుగా గుర్తించింది. ఉత్తరాంధ్ర నుంచి 20–30 లక్షల మంది వలసలు పోతున్నారు. కుప్పంలో కూడా 70–80 వేల మంది ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ తరుణంలో సమానత్వం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

చంద్రబాబు కేవలం పరిపాలన, విద్య, వైద్యం, పారిశ్రామికీకరణను కేవలం మూడు మండలాలకే పరిమితం చేశారు. కనీసం పక్కనున్న పల్నాడు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలనూ పట్టించుకోలేదు. ఏపీ పునర్వ్యవస్థీకరణ తర్వాత శివరామకృష్ణన్‌ కమిటీ ఎక్కడా పర్యావరణానికి హాని కలిగించకుండా, ఒకచోట నుంచి మరోచోటుకు తరలించకుండా రాజధాని ఏర్పాటుకావాలని సిఫారసు చేసింది. దీనికి రాజధాని వికేంద్రీకరణ ఒక్కటే మార్గమని చెప్పింది. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా ప్రాంతంలోని వ్యవసాయాన్ని కదిలిస్తే భవిష్యత్తులో సమస్యలొస్తాయని హెచ్చరించింది. కానీ, చంద్రబాబు వాటిని తుంగలో తొక్కి అప్పటి మంత్రి నారాయణ అధ్యక్షతన కమిటీని వేసి ఆయన నివేదిక ఆధారంగా రాజధానిని ప్రకటించారు.  

మరిన్ని వార్తలు