ఆర్నెల్లు అధికారం అప్పగిస్తే..అందరికీ ‘బంధు’ ఇస్తారా?: లక్ష్మారెడ్డి 

5 Sep, 2021 04:55 IST|Sakshi

జడ్చర్ల: ‘కాంగ్రెస్, బీజేపీలకు ఆరు నెలలపాటు అధికారాన్ని అప్పగిస్తే రాష్ట్రంలో దళితబంధు వంటి పథకాలను బీసీ, ఎస్టీ, మైనార్టీ, ఓసీలందరికీ ఏకకాలంలో అందజేస్తారా.. ఇంటింటికీ ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారా.. అది సాధ్యమయ్యేనా..’ అంటూ జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి ఆయా పార్టీలకు సవాల్‌ విసిరారు. శనివారం జడ్చర్లలోని తాలుకా క్లబ్‌ కార్యాలయం ఆవరణలో టీఆర్‌ఎస్‌ వార్డు కమిటీల ఏర్పాటు సమావేశంలో ఆయన మాట్లాడారు.

జాతీయ కమిటీల నుంచి ఆయా పథకాలు రాష్ట్రవాప్తంగా ఒకేసారి అమలు చేసేలా తీర్మానించి లెటర్‌ తీసుకొస్తే ఓ ఆరు నెలల పాటు వారికి అధికారం అప్పజెబుతామన్నారు. సీఎం కేసీఆర్‌ అట్టడుగున ఉన్న దళితుల సంక్షేమం కోసం దశలవారీగా ‘దళితబంధు’ను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్‌లో బీసీ, ఎస్టీ, మైనార్టీ తదితరులకు వర్తింపజేస్తారన్నారు. అయితే విపక్ష నేతలు హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కోసమే ‘దళితబంధు’తెచ్చారని, రాష్ట్రమంతా ఎందుకు అమలు చేయడంలేదని, ఇతర వర్గాలకు ఆయా పథకం ఎందుకు ఇవ్వరని ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం సరైందికాదన్నారు.   

మరిన్ని వార్తలు