త్వరలో మంత్రివర్గ విస్తరణ.. డిప్యూటీ సీఎంగా ప్రధాని సన్నిహితుడు

26 May, 2021 02:31 IST|Sakshi

ఏడుగురు మంత్రులపై పీఎంఓకు అందిన ఫిర్యాదులు 

వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా మార్పులు 

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో ఇటీవల జరిగిన బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ఉన్నతస్థాయి సమావేశం అనంతరం ఉత్తర్‌ప్రదేశ్‌ రాజకీయాల్లో వేడి మొదలైంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఊహాగానాలు కొనసాగుతున్నాయి. మాజీ ఐఎఎస్, ప్రస్తుత ఎమ్మెల్సీ... ప్రధాని మోదీకి సన్నిహితుడైన ఏకె శర్మను యూపీ డిప్యూటీ సీఎంగా చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎందుకంటే ఇటీవల పూర్వాంచల్, వారణాసి ప్రాంతాల్లో శర్మ చేసిన కోవిడ్‌ నిర్వహణను మోదీ స్వయంగా ప్రశంసించారు.

మంత్రివర్గ విస్తరణలో ఐదుగురు కొత్తవారికి అవకాశం ఇవ్వనుండగా, ఏడుగురు మంత్రులను తొలగించే అవకాశాలున్నాయి. యోగి ఆదిత్యనాథ్‌ కేబినెట్‌లోని ముగ్గురు మంత్రులు చేతన్‌ చౌహాన్, కమలా రాణి, విజయ్‌ కశ్యప్‌ ఇటీవల కరోనా బారినపడి మరణించారు. అటువంటి పరిస్థితిలో కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ, రాబోయే ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడానికి సహాయపడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.  ఉత్తరప్రదేశ్‌లో కేబినెట్, స్వతంత్ర, సహాయ మంత్రులతో కలిసి మొత్తం 60 మంది మంత్రులు ఉండవచ్చు.

యోగి కేబినెట్‌లో 56 మంది మంత్రులు ఉండగా.. అందులో ముగ్గురి మరణంతో ఇప్పుడు మంత్రివర్గంలో 7 ఖాళీలు ఏర్పడ్డాయి. వచ్చే ఏడాది జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు సామాజిక సమీకరణాలను చక్కదిద్దేందుకు కమలదళం సిద్ధమైందని సమాచారం. మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వంలోని ఏడుగురు మంత్రులపై ఫిర్యాదులు ప్రధాని కార్యాలయానికి చేరుకున్నాయి. ఆ శాఖల్లోని అవినీతి, ఇతర లోపాల గురించి సమాచారం వెలుగులోకి వచి్చంది. అటువంటి పరిస్థితిలో త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో కొంతమంది మంత్రులను తొలగించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.   

మరిన్ని వార్తలు