టీఆర్‌ఎస్‌కు ఝలక్‌! 

21 Sep, 2020 09:01 IST|Sakshi
టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తున్న రామకృష్ణ  

సాక్షి, కంటోన్మెంట్‌: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ టీఆర్‌ఎస్‌ అధిష్టానానికి ఝలక్‌ ఇచ్చారు. ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సిందిగా అధిష్టానం ఆదేశించగా, ఆయన ఏకంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.  తద్వారా ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేయబోనంటూ స్పష్టం చేశారు. దీంతో కంటోన్మెంట్‌ బోర్డు సభ్యులంతా తమ పార్టీలోనే ఉన్నారంటూ చెప్పుకుంటూ వచ్చిన టీఆర్‌ఎస్‌ పెద్దలకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సూచనల మేరకు ఈ నెల 20వ తేదీ వరకు రామకృష్ణ బోర్డు ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సిందిగా రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పత్రికా ముఖంగా వెల్లడించారు. అయినప్పటికీ సదరు ఆదేశాలను బేఖాతరు చేస్తూ రామకృష్ణ ఉపాధ్యక్ష పదవికి బదులుగా, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీనికి తోడు సోమ వారం బోర్డు కార్యాలయంలో తన అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.  

తోటి సభ్యులతో పొసగకనే..: రామకృష్ణ 
స్వతంత్ర అభ్యర్థిగా కంటోన్మెంట్‌ బోర్డు సభ్యుడిగా ఎన్నికైన తనను టీఆర్‌ఎస్‌ పెద్దలు ఆదరించి, ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టారని రామకృష్ణ అన్నారు. అయితే తోటి బోర్డు సభ్యుల్లో కొందరితో పొసగని కారణంగానే తాను టీఆర్‌ఎస్‌కు దూరం కావాల్సి వస్తోందని రాజీనామా ప్రకటన సందర్భంగా పేర్కొన్నారు. ఇంతకాలం తనకు సహకరించిన మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు, ఎమ్మెల్యే సాయన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. ఒకవేళ అధిష్టానం నుంచి బుజ్జగింపులు వచ్చినా తన నిర్ణయంలో మార్పు ఉండకపోవచ్చన్నారు. వార్డు పరిధిలోని కార్యకర్తలు, తన అభిమానులతో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.  

అవిశ్వాసం తప్పకపోవచ్చు 
బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో, మిగిలిన ఏడుగురు టీఆర్‌ఎస్‌ బోర్డు సభ్యులు ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టడం ఖాయమని తెలుస్తోంది. ఈ మేరకు సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో భేటీ అయ్యాక, నేరుగా బోర్డు అధ్యక్షుడు అభిజిత్‌ చంద్రను కలిసి రాజీనామా సమర్పించనున్నట్లు బోర్డు సభ్యుడొకరు వెల్లడించారు. అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగానే తాము నడుచుకుంటామని ఇంతకాలం రామకృష్ణకు మద్దతుదారులుగా నిలిచిన బోర్డు సభ్యులు సైతం పేర్కొంటూ ఉండటం గమనార్హం.

మరిన్ని వార్తలు