బీజేపీలో చేరిన కెప్టెన్ అమరీందర్ సింగ్.. పంజాబ్ లోక్ కాంగ్రెస్ విలీనం

19 Sep, 2022 19:39 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరారు. కేంద్రమంత్రులు కిరెన్ రిజుజు, నరేంద్ర సింగ్ థోమర్ సమక్షంలో ఆయన కమలం పార్టీ కండువా కప్పుకున్నారు. గతేడాది అయన స్థాపించిన పార్టీ పంజాబ్‌ లోక్ కాంగ్రెస్‌ను కూడా బీజేపీలో వీలీనం చేశారు. ఢిల్లీలో సోమవారం ఈ కార్యక్రమం జరిగింది. బీజేపీలో చేరిన అనంతరం ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో అమరీందర్ సింగ్ భేటీ అయ్యారు.

కెప్టెన్ అమరీందర్‌ సింగ్‌ను పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం పదవి నుంచి తప్పించింది కాంగ్రెస్. ఆ తర్వాత ఆయన పార్టీని వీడారు. సొంతంగా పంజాబ్ లోక్ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించారు. బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ పోటీ చేసిన స్థానం నుంచి ఓడిపోయారు. ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేకపోయి ఆయన పార్టీ దారుణ పరాభవం మూటగట్టుకుంది.

సెప్టెంబర్ 12నే అమిత్‌షాను ఢిల్లీలో కలిశారు అమరీందర్ సింగ్. చర్చలు ఫలవంతంగా జరిగినట్లు పేర్కొన్నారు. జాతీయ భద్రత, పంజాబ్‌లో నార్కో టెర్రరిజం గురించి చర్చించినట్లు చెప్పారు.  కెప్టెన్ అమరీందర్ సింగ్‌ రాజకీయాల కంటే దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తారని ఆయన పార్టీలో చేరిన అనంతరం బీజేపీ కొనియాడింది.
చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష బరిలో శశి థరూర్‌! సోనియాతో కీలక భేటీ

మరిన్ని వార్తలు