మార్షల్స్‌పై దాడి వీడియోలు విడుదల చేసిన కేంద్రం

12 Aug, 2021 17:00 IST|Sakshi

సీసీటీవీ ఫుటేజ్‌ విడుదల చేసిన కేంద్రం

సాక్షి, న్యూఢిల్లీ: నిన్న రాజ్యసభలో పెనుదుమారమే చెలరేగింది. పెగాసస్‌ నిఘా, కొత్త వ్యవసాయ సాగు చట్టాలపై చర్చించాలంటూ ఆందోళన చేపట్టిన విపక్ష సభ్యులపై కేంద్రం బయటి వ్యక్తులను తీసుకువచ్చి.. దాడి చేయించిందంటూ ప్రతిపక్ష సభ్యులు ఆరోపణలు చేశారు. విపక్షాల ఆరోపణలకు కేంద్రం ధీటుగా బదులిచ్చింది. బుధవారం నాటి రగడకు సంబంధించిన వీడియోని విడుదల చేసింది. దీనిలో విపక్ష నేతలు మార్షల్స్‌పై దాడి చేస్తున్న దృశ్యాలున్నాయి. దారుణమైన విషయం ఏంటంటే.. మహిళా మార్షల్స్‌పై విపక్ష సభ్యులు దాడి చేయడం వీడియోలో చూడవచ్చు. 

రాజ్యసభలో విపక్ష సభ్యుల అనుచిత ప్రవర్తనపై కేంద్ర మంత్రులు మండిపడ్డారు. తమ ప్రవర్తనకు చింతిస్తూ విపక్ష సభ్యులు తక్షణమే క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రులు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార, క్రీడా శాఖమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రజలు తమ సమస్యల గురించి పార్లమెంటులో చర్చిస్తారని ఎదురుచూస్తారు.. కానీ ఈ పార్లమెంట్ సమావేశాలలో విపక్షాలు అరాచకం సృష్టించాయి. ప్రతిపక్ష పార్టీల ఎంపీలు… దేశంలోని వ్యక్తులు, పన్ను చెల్లింపుదారుల డబ్బు వృధా అవుతున్నా దాని గురించి పట్టించుకోలేదు. నిన్న రాజ్యసభలో జరిగిన సంఘటన ఖండించదగినది. మొసలి కన్నీళ్లు కార్చే బదులు, వారు తమ ప్రవర్తన పట్ల క్షమాపణ చెప్పాలి’’ అని డిమాండ్‌ చేశారు.

విపక్ష సభ్యుల ప్రవర్తన దారుణం: ప్రహ్లాద్‌ జోషి
పార్లమెంటులో విపక్ష సభ్యుల ప్రవర్తన దారుణం అన్నారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. నిన్నటి రగడపై విపక్ష సభ్యులు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేశామని రాహుల్ అంటున్నారు.. పార్లమెంటులో ఏం జరిగిందో అందరూ చూశారు. సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని చైర్మన్‌ను కోరతాం అన్నారు ప్రహ్లాద్‌ జోషి.

రాజ్యసభలో విపక్షాల రగడ..
బుధవారం రాజ్యసభలో ప్రతిపక్షాలు నిరసన తెలుపుతూ చైర్మన్ వెల్‌లోకి వెళ్లిన సందర్భంగా వారిని కంట్రోల్ చేసేందుకు మార్షల్స్‌ లోపలికి వచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష ఎంపీలకు, మార్షల్స్‌కు మధ్య తోపులాట జరిగింది. అయితే మగ మార్షల్స్‌ తమపై చేయిచేసుకున్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు మహిళా ఎంపీలు ఆరోపిస్తున్నారు. పార్లమెంట్‌లో ఎంపీలపై దాడి చేయడం ఇదే తొలిసారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీలపై దాడి చేయడానికి బయటి వాళ్లను సభలోకి తీసుకొచ్చారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమేనని రాహుల్ అన్నారు.

మరిన్ని వార్తలు