మోగిన ఎన్నికల నగారా

27 Feb, 2021 02:00 IST|Sakshi

5 అసెంబ్లీలకు షెడ్యూల్‌ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం

పశ్చిమ బెంగాల్‌లో 8, అస్సాంలో 3 విడతల్లో ఎన్నికలు

తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఒకే విడతలో పోలింగ్‌

మే 2 న ఎన్నికల ఫలితాలు విడుదల

సాక్షి , న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉత్కంఠకు తెరలేపిన పశ్చిమ బెంగాల్‌ సహా తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల నగారాను శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం మోగించింది. ఐదు అసెంబ్లీలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరా విడుదలచేశారు. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికల కోడ్‌ అమలులోకి వస్తుందని ఆయన ప్రకటించారు. అత్యధికంగా పశ్చిమబెంగాల్‌లోని 294 నియోజకవర్గాలకు 8 విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అసోంలోని 126 స్థానాలకు 3 విడతల్లోను, 234 స్థానాలు ఉన్న తమిళనాడు, 140 స్థానాలు ఉన్న కేరళ, 30 నియోజకవర్గాలున్న పుదుచ్చేరిల్లో ఒకే దశలో ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయనున్నారు. ఈ ఐదు అసెంబ్లీల్లోని 824 నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలను మే 2వ తేదీన ప్రకటించనున్నారు. మొత్తం 18.68 కోట్ల ఓటర్లు 2.7లక్షల పోలింగ్‌ స్టేషన్లలో తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. కోవిడ్‌ –19 ముప్పు కారణంగా ఈ ఎన్నికల్లో పోలింగ్‌ స్టేషన్ల సంఖ్యను భారీగా పెంచారు. పోలింగ్‌ సమయాన్ని కూడా ఒక గంట పాటు పెంచారు. అలాగే, పోలింగ్‌ విధుల్లో పాల్గొనే సిబ్బందికి ముందే కోవిడ్‌–19 టీకా వేస్తామని సీఈసీ అరోరా తెలిపారు. సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరిస్తామని, ఎన్నికల ప్రక్రియను వెబ్‌ కాస్టింగ్‌ చేస్తామని వెల్లడించారు.

8 దశల్లో బెంగాల్‌ ‘దంగల్‌’
ఈ ఏడాది మే 30వ తేదీతో ముగిసే పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీలోని 294 నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ఈసారి 8 దశల్లో జరుగనుంది. మొదటి దశలో ఐదు జిల్లాల్లోని 30 నియోజకవర్గాలకు మార్చి 2వ తేదీన నోటిఫికేషన్‌ జారీ అవుతుంది. మొదటిదశ పోలింగ్‌ మార్చి 27న జరుగుతుంది. రెండవ దశలో 4 జిల్లాల్లోని 30 స్థానాలకు ఏప్రిల్‌ 1వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. మూడో దశలో 3 జిల్లాల్లోని 31 నియోజకవర్గాలకు ఏప్రిల్‌ 6వ తేదీన పోలింగ్‌ నిర్వహిస్తారు. నాలుగో దశలో 5 జిల్లాల్లోని 44 నియోజకవర్గాలకు ఏప్రిల్‌ 10వ తేదీన పోలింగ్‌ జరుగుతుంది. ఏప్రిల్‌ 17న పోలింగ్‌ జరుగబోయే ఐదో దశలో 6 జిల్లాల్లోని 45 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆరో దశలో 4 జిల్లాల్లోని 43 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్‌ ఏప్రిల్‌ 22న జరుగుతుంది. ఏడవ దశ పోలింగ్‌ ప్రక్రియలో 5 జిల్లాల్లోని 36 నియోజకవర్గాలు ఉన్నాయి. వాటికి ఏప్రిల్‌ 26న పోలింగ్‌ జరుగుతుంది. 4 జిల్లాల్లోని 35 నియోజకవర్గాలకు చివరగా ఎనిమిదవ దశలో ఏప్రిల్‌ 29న ఎన్నికలు జరుగుతాయి. పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 294 స్థానాల్లో 68 ఎస్సీ, 16 ఎస్టీ రిజర్వ్‌డ్‌ సీట్లు ఉన్నాయని ఈసీ ప్రకటించింది. 2016లో 7 దశల్లో జరిగిన ఎన్నికలకు 77,413 పోలింగ్‌ స్టేషన్లను వినియోగించగా, ఈసారి 31.65శాతం పెంచి 1,01,916 పోలింగ్‌ స్టేషన్లను వినియోగించనున్నారు. పశ్చిమబెంగాల్‌ ఎన్నికల్లో ఇద్దరు ప్రత్యేక పరిశీలకులను నియమిస్తామని, అవసరమైతే మరో పరిశీలకుడిని కూడా ఏర్పాటు చేస్తామని సునీల్‌ ఈరోరా వెల్లడించారు.

అసోంలో మూడు దశల్లో ఎన్నికలు
అసోంలోని 126 నియోజకవర్గాలకు మూడు దశల్లో ఎన్నికల ప్రక్రియను చేపట్టనున్నారు. మొదటి దశలో 47 నియోజకవర్గాలకు మార్చి 2వ తేదీన నోటిఫికేషన్‌ జారీ అవుతుంది. నామినేషన్‌ దాఖలుకు మార్చి 9 ఆఖరు తేదీగా నిర్ణయించారు. మొదటిదశ పోలింగ్‌ మార్చి 27న జరుగుతుంది. రెండవ దశలో 30 స్థానాలకు మార్చి 5వ తేదీన నోటిఫికేషన్‌ జారీ అవుతుంది. నామినేషన్‌ దాఖలుకు మార్చి 12 తేదీని ఆఖరు తేదీగా ప్రకటించారు. రెండోదశ పోలింగ్‌ ఏప్రిల్‌ 1వ తేదీన జరుగనుంది. మూడో దశలో 31 నియోజకవర్గాలకు మార్చి 12న నోటిఫికేషన్‌ జారీ అవుతుంది. మార్చి 19లోగా నామినేషన్ల దాఖలుకు అవకాశం కల్పించారు. మూడో దశ పోలింగ్‌ ప్రక్రియను ఏప్రిల్‌ 6వ తేదీన నిర్వహించనున్నారు.

కోవిడ్‌–19 ప్రోటోకాల్స్‌ తప్పనిసరి
కరోనా వైరస్‌ సంక్రమణ దృష్ట్యా ఎన్నికల నిర్వహణలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సునీల్‌ అరోరా వెల్లడించారు. ఎన్నికలు జరుగబోయే 2.7లక్షల పోలింగ్‌ స్టేషన్లు అన్నీ గ్రౌండ్‌ ఫ్లోర్‌లోనే ఉంటాయని ఆయన తెలిపారు. కరోనా కారణంగా ఆన్‌లైన్‌లో నామినేషన్ల స్వీకరణకు అవకాశం కల్పిస్తున్నామని, నామినేషన్లు వేసేందుకు రిటర్నింగ్‌ అధికారి వద్దకు అభ్యర్థితో కలిసి కేవలం ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ఇంటింటికి తిరిగి చేసే ప్రచారంలోనూ అభ్యర్థితో కలిసి 5గురికి మాత్రమే అనుమతి ఉంటుందని, రోడ్‌షోలు, ఎన్నికల సభల విషయంలో కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ తప్పనిసరిగా పాటించాల్సిందేనని ఈసీ స్పష్టంచేసింది. రోడ్‌ షోలో గరిష్టంగా ఐదు వాహనాలనే అనుమతిస్తామన్నారు.  నిబంధనల ఉల్లంఘనపై సీ విజిల్‌ యాప్‌ను వినియోగించుకొని ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ ఐదు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలోని ఓటర్ల జాబితాను జనవరిలోనే ముద్రించామని ఈసీ ప్రకటించింది. కౌంటింగ్‌ ప్రక్రియలో సాధారణంగా ఉండే 14 టేబుల్స్‌ బదులుగా కోవిడ్‌ కారణంగా కేవలం 7 టేబుల్స్‌ వినియాగించాలని నిర్ణయించారు.  వీటితో పాటు  14 రాష్ట్రాల్లోని 18 అసెంబ్లీ నియోజక వర్గాలకు, 4 లోక్‌సభ నియోజకవర్గాల ఉప ఎన్నికలను ఈ 5 అసెంబ్లీల ఎన్నికలతో కలిసి నిర్వహిస్తామని అరోరా వెల్లడించారు.

తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో ఒకే దశ
తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి మూడు అసెంబ్లీలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. 234 స్థానాలు ఉన్న తమిళనాడు, 140 నియోజకవర్గాలున్న కేరళ, 30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీలకు మార్చి 12న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నామినేషన్‌ దాఖలుకు ఆఖరు తేదీ మార్చి 19కాగా, నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 22 వరకు అవకాశం కల్పించారు. ఈ మూడు అసెంబ్లీలకు ఏప్రిల్‌ 6వ తేదీన పోలింగ్‌ ప్రక్రియ జరుగనుంది. కేరళలోని మల్లుపురం, తమిళనాడులోని కన్యాకుమారి లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలను అసెంబ్లీ ఎన్నికలతో పాటే నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది.

మహిళలకు తమిళ సీఎం వరాలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైన వేళ తమిళనాడు ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు పలు వరాలు ప్రకటించారు. ఆరు పౌన్ల(48 గ్రాములు) వరకు బంగారు ఆభరణాలను తనఖా పెట్టి సహకార సొసైటీల వద్ద తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్నామని శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. అలాగే, సహకార బ్యాంకులు, సొసైటీల్లో స్వయం సహాయ బృందాల్లోని మహిళలు తీసుకున్న రుణాలను కూడా మాఫీ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో లక్షకు పైగా స్వయం సహాయ బృందాలున్నాయని, వాటిలో 15 లక్షల పేద మహిళలు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. కరోనాతో పాటు భారీ తుపాన్లు రాష్ట్ర ప్రజలను భారీగా దెబ్బతీశాయన్నారు.

మోదీ, షా చెప్పారా?
పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలను 8 విడతలుగా నిర్వహించాలన్న నిర్ణయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రంగా తప్పుబట్టారు. బీజేపీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారం నిర్వహించుకునేందుకు వీలుగా ఈ తేదీలను ప్రకటించారని ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సూచనల మేరకు ఈ తేదీలను ప్రకటించారా? అని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. బీజేపీని ఉద్దేశిస్తూ ‘కాషాయ క్యాంప్‌’ కళ్ల ద్వారా రాష్ట్రాన్ని చూడొద్దంటూ ఎన్నికల సంఘానికి సూచించారు. ఇతర రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలను ముగించి, పశ్చిమబెంగాల్‌లో మాత్రం 8 విడతలుగా ఎన్నికలు నిర్వహిం చడంపై ఈసీపై అనుమానాలు తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించారు.

ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ ఎన్నికల్లో తృణమూల్‌ విజయాన్ని అడ్డుకోలేరని ఆమె స్పష్టం చేశారు. మరోవైపు, ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనకు కొద్ది గంటల ముందు మమతా బెనర్జీ రాష్ట్రంలోని కార్మికులకు వేతన పెంపు ప్రకటించారు. రాష్ట్ర పట్టణ ఉపాధి పథకం ద్వారా ఉపాధి పొందుతున్న కార్మికుల దినసరి వేతనాన్ని పెంచుతున్నామన్నారు. నైపుణ్యత లేని కార్మికుల రోజువారీ వేతనాన్ని రూ. 144 నుంచి రూ. 202కి, సాధారణ నైపుణ్యాలున్న కార్మికుల దినసరి వేతనాన్ని రూ. 172 నుంచి రూ. 303కి పెంచుతున్నామన్నారు. కొత్తగా నిపుణులైన కార్మికుల విభాగాన్ని కూడా ప్రారంభిస్తున్నామని, వారికి రూ. 404 దినసరి వేతనంగా నిర్ధారించామని తెలిపారు. మీడియా సమావేశం అనంతరం సీఈసీ సునీల్‌ అరోరా, కమిషనర్లు సుశీల్‌ చంద్ర, రాజీవ్‌కుమార్‌

మరిన్ని వార్తలు