బీజేపీతో కలిసిపోదాం.. సీఎంకు శివసేన ఎమ్మెల్యే లేఖ

21 Jun, 2021 04:25 IST|Sakshi

ఉద్ధవ్‌ ఠాక్రేకు శివసేన ఎమ్మెల్యే లేఖ

ముంబై/పుణే: బీజేపీతో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సయోధ్య చేసుకోవాలని శివసేన ఎమ్మెల్యే ప్రతాప్‌ సర్నాయక్‌ మహారాష్ట్ర సీఎం, పార్టీ అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేను కోరారు. ఆలస్యం కాకముందే మేల్కొనాలని విజ్ఞప్తి చేశారు. ప్రతాప్‌ సర్నాయక్‌పై మనీ ల్యాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తు జరుపుతోంది. తమతో పాటు పలువురు శివసేన నాయకులు కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇవి తొలిగిపోవాలంటే బీజేపీతో సయోధ్య కుదుర్చుకోవాలని ఈనెల 10వ తేదీన రాసిన లేఖలో ఉద్ధవ్‌ను సర్నాయక్‌ కోరారు. 

సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములైన కాంగ్రెస్, ఎన్‌సీపీలు శివసేన శ్రేణుల్లో విబేధాలు సృష్టించి పార్టీని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నా... ఇరుపార్టీల నాయకుల మధ్య వ్యక్తిగత సృహుద్భావ సంబంధాలు ఉన్నాయని... ఆలస్యం కాకముందే మేల్కొని బీజేపీతో, ప్రధానితో చేతులు కలపాలని ఉద్ధవ్‌కు సూచించారు. సర్నాయక్‌ లేఖ మహా వికాస్‌ అఘాడి (శివసేన నేతృత్వంలో కాంగ్రెస్, ఎన్‌సీపీలు భాగస్వాములుగా 2019 నవంబరులో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటైన విషయం తెలిసిందే) ప్రభుత్వంలో కలకలానికి కారణమైంది.

శివసేన అంతర్గత వ్యవహారంగా కాంగ్రెస్‌ దీన్ని అభివర్ణించింది. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ ఆదివారం స్పందిస్తూ... గత 18 నెలలుగా తామూ ఇదే చెబుతున్నామన్నారు. ‘ముస్లింలను దువ్వే కాంగ్రెస్, ఎన్‌సీపీ విధానాలను వ్యతిరేకించడం ద్వారానే శివసేన రాజకీయంగా ఎదిగింది. అధికారం కోసం ఇప్పుడవే పార్టీలతో జతకట్టింది. సర్నాయక్‌ లేఖపై ఉద్ధవ్‌ నిర్ణయం తీసుకోవాలి’ అని చంద్రకాంత్‌ పాటిల్‌ అన్నారు.

ఐదేళ్లూ మా మద్దతు ఉంటుంది: కాంగ్రెస్‌
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తామని, సంకీర్ణ భాగస్వాములతో ఎన్నికల పొత్తులుండవని ఇటీవల ప్రకటించిన మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నానా పటోలే కొత్త వివాదానికి తెరతీశారు. దీనిని దృష్టిలో పెట్టుకొని శివసేవ అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే శనివారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపకుండా... ఎన్నికల గురించి మాట్లాడితే జనం చెప్పులతో కొడతారని ఠాక్రే అన్నారు. దీంతో శివసేన, కాంగ్రెస్‌ల మధ్య సంబంధాలు క్షీణించాయనే దానికే ఇది సంకేతమని ఊహాగానాలు మొదలయ్యాయి. సంకీర్ణ ప్రభుత్వ మనుగడపైనా సందేహాలు వ్యక్తమయ్యాయి. దాంతో నానా పటోలే ఆదివారం స్పందించారు. మహా వికాస్‌ అఘాడి ప్రభుత్వానికి ఐదేళ్లూ తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. శివసేన– కాంగ్రెస్‌ల మధ్య ఎలాంటి సమస్యలు లేవన్నారు.

మరిన్ని వార్తలు