తెలంగాణను ఏం ఉద్ధరించావని రాష్ట్రాలు తిరుగుతున్నావ్‌ కేసీఆర్‌: కిషన్‌రెడ్డి ఫైర్‌

1 Sep, 2022 16:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ పాలిటిక్స్‌లో టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గమనే పరిస్థితి నెలకొంది. కాగా, సీఎం కేసీఆర్‌.. బీహార్‌ పర్యటనపై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. కేంద్రంపై విమర్శలు చేసేందుకే కేసీఆర్‌ పర్యటనలు చేస్తున్నారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. 

మంత్రి కిషన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ కేసీఆర్‌ను సీరియస్‌గా తీసుకోవడం లేదు. కేంద్రంపై విమర్శలు చేసేందుకే కేసీఆర్‌ పర్యటనలు చేస్తున్నారు. కేసీఆర్‌ తీరును చూసి తెలంగాణను చూసి నవ్వుకునే పరిస్థితి వచ్చింది. ఇతర రాష్ట్రాల్లో పార్టీలు కేసీఆర్‌ను లైట్‌ తీసుకున్నాయి. బీహార్‌ వెళ్లి ఏదో చెప్పాలనుకున్నారు. కేసీఆర్‌ మాటలు వినలేక బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ వెళ్లిపోతుంటే కేసీఆర్‌ బ్రతిమాలుకున్నారు. కానీ, ప్రతిపక్ష పార్టీలను ఏకం చేస్తానని కేసీఆర్‌ చెబుతున్నారు. కేసీఆర్‌ మాటలు విని సీఎం నితీష్‌ కుమార్‌ నువ్వుకున్నారు. 

ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఉండటమే తెలంగాణ మోడలా. తెలంగాణ డబ్బులు తెచ్చి బీహార్‌, పంజాబ్‌లో పంచుతున్నారు. తెలంగాణను ఉద్దరించానని చెబుతూ దేశమంతా తిరిగి ప్రచారం చేస్తున్నారు. మునావర్‌ ఫరూకీ షోకు అంత పెద్ద ఎత్తున భద్రత కల్పించి నిర్వహించాల్సిన అవసరం ఏముంది. ఈడీ, సీబీఐలను చూసి ఎందుకు భయపడుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో మరో బిగ్‌ స్కామ్‌.. పోలీసులకే ఊహించని షాకిచ్చారు!  

మరిన్ని వార్తలు