ఓడిపోయినా దక్కిన కేంద్రమంత్రి పదవి

8 Jul, 2021 08:58 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై : దేశ ప్రధానిగా నరేంద్రమోదీ అధికారం చేపట్టిన నాటి నుంచి దక్షిణాదిలో బలపడడమే లక్ష్యంగా రాజకీయ అడుగులు వేశారు. అందులో భాగంగా కన్యాకుమారీ నుంచి ఎంపీగా ఎన్నికైన పొన్‌ రాధాకృష్ణన్‌కు సహాయ మంత్రిపదవి కట్టబెట్టారు. 2015 డిసెంబరు 5వ తేదీన అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూసిన తరువాత ఆ పార్టీని తన కనుసన్నల్లోకి తీసుకుని తమిళనాడులో బీజేపీ పాగా వేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. తమిళనాడులో ఇటీవల జరిగిన అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు సమయంలో కంటే ముందు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్‌ న్యాయవాది ఎల్‌.మురుగన్‌ను బీజేపీ అధ్యక్షున్ని చేశారు. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని, శాసనసభలో బీజేపీ ఎలాగైనా కాలు మోపాలని నరేంద్రమోదీ దిశానిర్దేశం చేశారు.

అందుకు అనుగుణంగా ఎల్‌.మురుగన్‌ రాష్ట్రంలో వేల్‌యాత్ర పేరుతో పర్యటన చేసి ప్రజలను తమపార్టీ వైపు తిప్పుకునేందుకు గట్టి ప్రయత్నమే చేశారు. ఇందుకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తమిళనాడు శాఖ జాతీయ కో–ఇన్‌చార్జ్‌ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరుల సహకారంతో ఎన్నికల్లో పెద్దఎత్తున ప్రచారం చేశారు. అన్నాడీఎంకే–బీజేపీ కూటమి అధికారంలోకి రాకున్నా కమలనాథులు నాలుగు ఎమ్మెల్యే సీట్లను దక్కించుకున్నారు. అయితే తిరుపూరు జిల్లా తారాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఎల్‌.మురుగన్‌ ఓడిపోవడం బీజేపీని నిరాశకు గురిచేసింది. 

గెలిచిన, ఓడిన వారికి మంత్రిపదవులు..
గత అసెంబ్లీ ఎన్నికల్లో తారాపురం నియోజకవర్గం నుంచి గెలిచిన, ఓడిన ఇద్దరికీ మంత్రిపదవులు దక్కడం విశేషం. తారాపురం డీఎంకే అభ్యర్థి కయల్‌వెల్లి సెల్వరాజ్‌ చేతిలో ఎల్‌.మురుగన్‌ ఓడిపోయారు. బీజేపీ అధ్యక్షుడిపై గెలిచినందుకు బహుమతిగా సీఎం స్టాలిన్‌ ఆమెకు రాష్ట్రమంత్రివర్గంలో చోటు కల్పించగా, ఆమెపై పోటీ చేసి ఓడిపోయిన ఎల్‌.మురుగన్‌కు కేంద్రమంత్రి పదవి లభించింది. 

ఏబీవీపీ నుంచి కేంద్రమంత్రి వరకు..
1977 మే 29న జన్మించిన ఎల్‌.మురుగన్‌ మానవ హక్కుల న్యాయశాస్త్రంలో మద్రాసు యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా పుచ్చుకున్న ఈయన 15 ఏళ్లు న్యాయవాది వృత్తిలో కొనసాగారు. అఖిలభారత విద్యార్థి పరిషత్‌ నేపథ్యం కలిగిన ఎస్సీ (అరుంధతీయ) సామాజిక వర్గానికి చెందిన వారు. 2006లో శంగగిరి, 2011లో రాశీపురం సార్వత్రిక ఎన్నికల్లో, 2011లో శంకరన్‌కోవిల్‌ ఉప ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. అయినా 2020 మార్చిలో బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా నియమితులయ్యే వరకు ఎల్‌.మురుగన్‌ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. కేంద్రమంత్రి పదవి హోదా లభించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 

మరిన్ని వార్తలు