తెలంగాణలో ధాన్యం కొనుగోలు.. కేసీఆర్‌ సర్కార్‌పై కేంద్రమంత్రి ఫైర్‌

20 Jul, 2022 18:33 IST|Sakshi

న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ ధ్వజమెత్తారు. రాజకీయ ఎజెండాతోనే కేంద్రంపై తెలంగాణ ప్రభుత్వం నిందలు వేస్తోందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వానికి రాజకీయాలే ముఖ్యమని, రాష్ట్ర సీఎం, మంత్రులు అసభ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులపై టీఆర్‌ఎస్‌ నేతల విమర్శలు బాధాకరమన్నారు. తమకు వ్యతిరేకంగా మాట్లాడితే ఒరిగేది లేదని, కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదన్నారు.

తెలంగాణ సర్కార్‌ బాధ్యతారహిత్యంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుతోనే పేదలకు బియ్యం అందడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పులకు రైతులను బలి చేయడం సరి కాదని భావించి వెంటనే వడ్లు, బియ్యం సేకరణకు అనుమతి ఇస్తున్నామని తెలిపారు. ఈ మేరకు ధాన్యం సేకరణపై ఎఫ్‌సీఐ తెలంగాణకు క్లియరెన్స్‌ ఇస్తుందని పేర్కొన్నారు. 

తెలంగాణ మిల్లుల్లో నిల్వ సౌకర్యాలు సరిగా లేవని పీయూష్‌ గోయల్‌ విమర్శించారు. ఎన్నిసార్లు లేఖ రాసినా తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదని తెలిపారు. తెలంగాణ మిల్లుల్లో రైస్‌ స్టాక్‌ నిల్వలు సరిగా లేవని అన్నారు. మిల్లుల్లో అక్రమాలు జరిగాయని అందుకే ఈ చర్చ తీసుకున్నామని తెలిపారు. తమ చర్చల వల్లే ఇప్పుడు బియ్యం సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు.  ఏప్రిల్, మే నెలలో బియ్యం ఇవ్వకుండా పేదలకు అన్యాయం చేశారన్నారు. 
చదవండి: పంజాబ్‌లో ఎన్‌కౌంటర్‌.. సిద్ధూ హత్యకేసులో ఇద్దరు నిందితులు హతం

మరిన్ని వార్తలు