సెంట్రల్‌ విస్టాపైనా విమర్శలా?

17 Sep, 2021 05:58 IST|Sakshi

ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ ఆగ్రహం

గడువులోగా నూతన పార్లమెంట్‌ నిర్మాణం పూర్తవుతుందని వెల్లడి

నూతన డిఫెన్స్‌ ఆఫీసు కాంప్లెక్స్‌లు ప్రారంభం

న్యూఢిల్లీ: ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ప్రధాని∙మోదీ విమర్శించారు. సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో రక్షణ శాఖ కార్యాలయ భవనాలు భాగమేనని, ఈ విషయంలో ప్రతిపక్షాలు నోరెత్తడం లేదని పేర్కొన్నారు. సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో భాగంగా కస్తూ ర్బాగాంధీ మార్గ్, ఆఫ్రికా అవెన్యూలో నిర్మించిన రెండు నూతన బహుళ అంతస్తుల రక్షణ శాఖ కార్యాలయ కాంప్లెక్స్‌లను మోదీ గురువారం ప్రారంభించారు.

ఇక్కడ 7,000 మందికిపైగా రక్షణ శాఖ, సైనిక దళాల ఉద్యోగులు పని చేయనున్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. కొత్త పార్లమెంట్‌ భవన నిర్మాణం నిర్దేశిత గడువులోగా పూర్తవుతుందన్న నమ్మకం ఉందన్నారు. భారత రక్షణ దళాలు మరింత సమర్థంగా, ప్రభావవంతంగా పని చేసేందుకు మనం కొనసాగిస్తున్న ప్రయత్నాలకు ఈ నూతన డిఫెన్స్‌ ఆఫీసు కాంప్లెక్స్‌లు బలం చేకూరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాజధాని అంటే కేవలం నగరమేనా?
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నిర్మించిన స్థావరాల నుంచే ఇప్పటిదాకా రక్షణ శాఖకు సంబంధించిన కార్యకలాపాలు సాగాయని, ఆధునిక అవసరాల దృష్ట్యా కొత్త భవనాలు నిర్మించినట్లు మోదీ వివరించారు. ఇకపై దేశ రక్షణకు సంబంధించి త్రివిధ దళాల కార్యకలపాలు ఇక్కడి నుంచి నడుస్తాయని అన్నారు. రాజధానిలో ఆధునిక రక్షణ వ్యవస్థను సృష్టించే యజ్ఞంలో ఇదొక భారీ ముందడుగు అని వ్యాఖ్యానించారు. డిఫెన్స్‌ ఆఫీసు కాంప్లెక్స్‌ల గురించి మాట్లాడితే ఆరోపణల్లోని డొల్లతనం బయటపడుతుందనే భయంతో దీనిపై నోరువిప్పడం లేదని ప్రతిపక్ష నేతలపై మోదీ ధ్వజమెత్తారు.

రాజధాని అంటే కేవలం ఒక నగరం మాత్రమే కాదని, దేశ బలం, సంస్కృతి, ఆలోచనా శక్తి, అంకితభావానికి చిహ్నమని ఉద్ఘాటించారు. డిఫెన్స్‌ ఆఫీసు కాంప్లెక్స్‌లను కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నిర్మించారు. నిధులు, వనరులను రక్షణ శాఖ సమకూర్చింది. వీటితో 9.60 లక్షల చదరపు అడుగుల్లో ఆఫీసు స్పేస్‌ అందుబాటులోకి వచ్చింది. 14 కార్యాలయాలను కేజీ మార్గ్‌ కాంప్లెక్స్‌లోకి, 13 కార్యాలయాలను ఆఫ్రికా అవెన్యూ కాంప్లెక్స్‌లోకి తరలించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆఫ్రికా అవెన్యూలోని డిఫెన్స్‌ ఆఫీసు కాంప్లెక్స్‌ను ప్రధాని మోదీ సందర్శించారు. త్రివిధ దళాల అధికారులతో సమావేశమయ్యారు.

>
మరిన్ని వార్తలు