ఈ నెల 17న అఖిలపక్ష భేటీకి కేంద్రం పిలుపు..

13 Sep, 2023 16:11 IST|Sakshi

సెప్టెంబర్ 18-22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు

ఈ నెల 17న అఖిల పక్ష భేటీ

స్పెషల్ సెషన్‌పై నేడు రాజ్‌నాథ్ నివాసంలో కేంద్ర మంత్రుల భేటీ

ఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు కేంద్రం సన్నద్ధమౌతోంది. స్పెషల్ మీటింగ్ ఎజెండాపై చర్చించేందుకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ నివాసంలో నేడు కీలక సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి అమిత్ షా, అనురాగ్ ఠాకూర్‌లు హాజరయ్యారు. సెప్టెంబర్‌ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 17న అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీ అనంతరం ఎజెండాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై  కొన్ని రోజులుగా దేశంలో రాజకీయంగా వివాదం నెలకొంది. ఈ ప్రత్యేక సమావేశంలోనే దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చనున్నారనే ఊహాగానాలు వెలుగులోకి వచ్చాయి. పాత పార్లమెంట్ భవనం నుంచి కొత్త పార్లమెంట్‌లోకి అధికారికంగా మారనున్నారనే మరికొందరు చెప్పుకొచ్చారు.  ఈ క్రమంలోనే ఈ నెల17న అఖిలపక్ష భేటీ ఉంటుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. 17న సాయంత్రం 4:30కి నేతలందర్ని మీటింగ్‌కు ఆహ్వానించారు. 

ఇప్పటికే ఈ స్పెషల్ సెషన్ ఎజెండా తెలపాలని కాంగ్రెస్ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. ఏ రాజకీయ పార్టీతో చర్చించకుండానే ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంపై ఆమె మండిపడ్డారు. ప్రధాన ఉద్ధేశం ఏంటో తెలిపాలని కోరారు. ప్రత్యేక సమావేశాలను వినాయక చవితి రోజున నిర్వహించడంపై శివ సేన (యూబీటీ) నేత సుప్రీయా సూలే కేంద్రంపై మండిపడ్డారు. హిందువుల పవిత్ర పండగ రోజున పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఎలా నిర్వహిస్తారని దుయ్యబట్టారు. 

ఇటీవల జీ20 డిన్నర్ మీటింగ్‌ ఆహ్వానంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పిలవడంతో దేశం పేరును మార్చనున్నారనే పుకార్లు మొదలయ్యాయి. ఈ నెల నిర్వహించనున్న ప్రత్యేక సమావేశాల్లోనే ఈ బిల్లును చర్చకు తీసుకువస్తారని ఊహాగానాలు ప్రారంభం అయ్యాయి.

ఇదీ చదవండి: నేడు ఇండియా కూటమి సమన్వయ కమిటీ భేటీ.. ప్రధాన సవాళ్లు ఇవే..
   

మరిన్ని వార్తలు