కశ్మీరీ పండిట్లకు రక్షణ ఏదీ?.. బిల్కిస్‌ బానో గ్యాంగ్‌ రేప్‌ దోషులకు క్షమాభిక్షా?: ఒవైసీ

17 Aug, 2022 09:00 IST|Sakshi

ఢిల్లీ: కశ్మీరీ పండిట్ల రక్షణ విషయంలో కేంద్రం అవలంభిస్తున్న విధానాన్ని తప్పుబట్టారు ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ. తాజాగా అక్కడ కశ్మీరీ పండిట్లపై జరిగిన దారుణ దాడి నేపథ్యంలో ఆయన తీవ్రంగా స్పందించారు. 

కశ్మీరీ లోయలో కశ్మీరీ పండిట్లకు రక్షణ కరువైంది. కేంద్ర పాలన దారుణంగా విఫలమవుతోంది. ఆర్టికల్‌ 370 రద్దు పండిట్లకు లాభం చేకూరుస్తుందని ప్రచారం చేసింది కేంద్రం. కానీ, ఇప్పుడు వాళ్లు అక్కడ అభద్రతా భావానికి లోనవుతున్నారు అని కేంద్రాన్ని నిందించారు ఒవైసీ. అక్కడ(జమ్ము కశ్మీర్‌)లో బీజేపీ చేత నియమించబడ్డ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఉన్నారు. నరేంద్ర మోదీ పాలనే అక్కడా సాగుతోంది. కానీ, చేతకానీ స్థితిలో ఉండిపోయారు వాళ్లు అంటూ విమర్శించారు. 

అలాగే.. గుజరాత్‌లో బిల్కిస్‌ బానో దురాగతం నిందితులకు క్షమాభిక్ష పెట్టి విడుదల చేయడంపైనా ఒవైసీ మండిపడ్డారు. ప్రధాని మోదీ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలోనూ నారీశక్తి గురించి మాట్లాడారు. అలాంటిది గ్యాంగ్‌రేప్‌ దోషులకు రిలీజ్‌ చేయడం సమంజసమేనా? అని ప్రశ్నించారు. 

ఇక యూపీలో గాడ్సే ఫొటోతో తిరంగా యాత్రను నిర్వహించడంపై.. అక్కడి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ఎంపీ ఒవైసీ. మాటల్లో గాంధీని ఉపయోగిస్తున్నారని.. కానీ, చేతల్లో గాడ్సే మీద ప్రేమను ఒలకబోస్తున్నారంటూ యోగి సర్కార్‌పై మండిపడ్డారు.

ఇదీ చదవండి: బిల్కిస్‌ బానో క(వ్య)థ ఇది!

మరిన్ని వార్తలు