నెక్ట్స్‌ టార్గెట్‌ సిసోడియానే: కేజ్రివాల్‌

3 Jun, 2022 06:28 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ అభివృద్ధిని చూసి కేంద్రం ఓర్వలేకపోతోందని సీఎం అరవింద్‌ కేజ్రివాల్‌ ఆరోపించారు. అందుకే తమ మంత్రులను టార్గెట్‌ చేసిందని గురువారం ఆరోపించారు. ‘‘ఆరోగ్య మంత్రి సత్యేందర్‌ జైన్‌ అరెస్టుతో యమున క్లీనింగ్, మొహల్లా క్లినిక్‌ల ప్రారంభం ఆగిపోయాయి. ఇప్పుడు విద్యారంగ అభివృద్ధిని అడ్డుకోవడానికి ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాను లక్ష్యంగా చేసుకున్నారు.

తప్పుడు కేసు బనాయించి ఆయన్ను త్వరలోనే అరెస్ట్‌ చేసే చాన్సుంది. ఈ మేరకు కొన్ని నెలల ముందే నాకు విశ్వసనీయ వర్గాల సమాచారం అందింది’’ అని వివరించారు. ‘‘కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇలా ఒకరి తర్వాత మరొకరిపై కేసులు పెట్టుకుంటూ టైం వేస్ట్‌ చేసుకుంటున్నారు. ఇలాగైతే ప్రభుత్వం ఎలా పని చేస్తుంది?’’ అని ప్రశ్నించారు. ‘‘నేను చేతులు జోడించి ప్రధానిని ఒక్కటే వేడుతున్నా. ఇలా ఒకరి తర్వాత మరొకరిని జైలు పాలు చేసే బదులుగా ఆప్‌ మంత్రులందరినీ ఒకేసారి అరెస్టు చేయండి’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

>
మరిన్ని వార్తలు