పట్టువీడని ప్రతిపక్షాలు

30 Jul, 2021 04:38 IST|Sakshi

పెగసస్, కొత్త సాగు చట్టాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి

పార్లమెంట్‌ ఉభయ సభల్లో ప్రతిపక్ష సభ్యుల ఆందోళన

కొనసాగుతున్న ప్రతిష్టంభన నిరసనల మధ్యే లోక్‌సభలో రెండు, రాజ్యసభలో ఒక బిల్లుకు ఆమోదం

ఉభయ సభలు వాయిదా

న్యూఢిల్లీ: పెగసస్‌ స్పైవేర్, కొత్త సాగు చట్టాలు, ధరల పెరుగుదలపై పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు పట్టువీడడంలేదు. వీటిపై కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్‌ చేస్తూ గురువారం సైతం ఉభయసభల్లో ఆందోళన కొనసాగించాయి. ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చారు. నినాదాలు ప్రారంభించారు. దీంతో స్పీకర్‌ సభను 11.30 గంటలకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రశ్నోత్తరాల సమయం ముగిసింది.

జీరో అవర్‌ ప్రారంభించబోతున్నామని, నినాదాలు ఆపి, సీట్లలోకి వెళ్లాలంటూ స్పీకర్‌ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్‌ ప్రతిపక్షాలను కోరారు. వారు వినిపించుకోకపోవడంతో సభను మధ్యాహ్నం 12.30 గంటలదాకా వాయిదా వేశారు.  మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు యథావిధిగా ఆందోళనకు దిగారు. వెల్‌లోకి దూసుకొచ్చి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెళ్లి మీ సీట్లలో కూర్చోండి అంటూ సభాధ్యక్ష స్థానంలో ఉన్న కిరిట్‌ ప్రేమ్‌జీబాయ్‌ సోలంకీ పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ వారు పట్టించుకోలేదు. ఈ గందరగోళం మధ్యే లోక్‌సభలో ఎయిర్‌పోర్ట్స్‌ ఎకనామిక్‌ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా(అమెండ్‌మెంట్‌) బిల్లు, ఇన్‌లాండ్‌ వెస్సెల్స్‌ బిల్లును ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదించారు.

నిన్నటి ఘటన బాధించింది: స్పీకర్‌
లోక్‌సభలో సభాధ్యక్ష స్థానంపై కొందరు ప్రతిపక్ష సభ్యులు కాగితాలను చించి విసిరివేయడం తనను ఎంతగానో బాధించిందని స్పీకర్‌ ఓంబిర్లా గురువారం అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. బుధవారం కాంగ్రెస్‌ సభ్యులు స్పీకర్‌ కుర్చీపై కాగితాలు, ప్లకార్డులను చించి విసిరేసిన సంగతి తెలిసిందే. గురువారం సభ ప్రారంభం కాగానే స్పీకర్‌ ఓంబిర్లా ఇదే అంశంపై మాట్లాడారు. ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తన పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులంతా  పార్లమెంట్‌ గౌరవాన్ని కాపాడాలన్నారు.  

రాజ్యసభలోనూ అదే దృశ్యం
పెగసస్‌ వ్యవహారం, కొత్త సాగు చట్టాలు, ధరల పెరుగుదలపైచర్చించాలంటూ ప్రతిపక్ష సభ్యులు రాజ్యసభలో డిమాండ్‌ చేశారు. వారు విరమించే పరిస్థితి కనిపించకపోవడంతో సభ శుక్రవారానికి వాయిదా పడింది. అంతకుముందు, మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫ్యాక్టరింగ్‌ రెగ్యులేషన్‌(సవరణ) బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చించేందుకు ముందుకు రావాలంటూ సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ కోరినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు లెక్కచేయలేదు. బీజేపీ, ఏఐఏడీఎంకే, టీఆర్‌ఎస్‌ సభ్యులు మాత్రం ఈ బిల్లుకు మద్దతుగా సభలో మాట్లాడారు. నిర్మలా సీతారామన్‌ సమాధానం ఇచ్చిన అనంతరం బిల్లు ఆమోదం పొందినట్లు డిప్యూటీ చైర్మన్‌ ప్రకటించారు. సభను శుక్రవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.   

ఈసీ ప్రతిపాదనలు పరిశీలిస్తున్నాం
ఎన్నికల సంస్కరణల విషయంలో ఎన్నికల సంఘం(ఈసీ) చేసిన ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు రాజ్యసభలో లిఖితపూర్వకంగా వెల్ల డించారు. ఓటర్ల జాబితాను ఆధార్‌ వ్యవస్థతో అనుసంధానించాలన్న ప్రతిపాదనను సైతం నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు