పోలీసుల తీరు అమానుషం

29 Sep, 2021 08:09 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న చాడ. చిత్రంలో కోదండరాం, జూలకంటి తదితరులు

కోదండరాంపై బట్టలు చినిగిపోయేలా దాడి

తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ పలు పార్టీల నాయకులు

సాక్షి, హైదరాబాద్‌: భారత్‌బంద్‌ సందర్భంగా రాష్ట్రంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించిన ప్రతిపక్ష నాయకుల పట్ల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరు అమానుషమని ఆయా పార్టీల రాష్ట్ర నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రొఫెసర్‌ కోదండరాంను పోలీసులు ఆయన బట్టలు చినిగిపోయేలా దాడి చేసి అరెస్ట్‌ చేయడం దారుణమని విరుచుకుపడ్డారు. ఈ చర్యను తెలంగాణ సమాజమంతా ఖండించాలన్నారు. బంద్‌ సందర్భంగా ప్రతిపక్ష పార్టీల నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై విచారణ జరిపించాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని నేతలపై దాడులకు పాల్పడిన పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని, డీజీపీని డిమాండ్‌ చేశారు.

ఈ మేరకు మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూంభవన్‌లో మీడియా సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఎం.కోదండరాం, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకుడు వెంకట్రాములు, సీపీఐ (ఎంఎల్‌) నాయకుడు గోవర్ధన్‌ మాట్లాడారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా మీడియాతో మాట్లాడారు. రాజకీయ పారీ్టల నాయకులపై మహిళలు, వృద్ధులని కూడా చూడకుండా దొంగలపై, దోషులపై వ్యవహరించినట్లు పోలీసులు అత్యంత విచక్షణారహితంగా దాడి చేసి అరెస్ట్‌ చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోందని నిరసన తెలియజేస్తూ తమిళనాడు, కేరళ, కర్ణాటక తదితర రాష్ట్రాలు బంద్‌కు మద్దతివ్వగా తెలంగాణ సర్కార్‌ మాత్రం బంద్‌ పాటించిన ఉద్యమకారులను అణచివేసేందుకు చర్యలు తీసుకోవడం దుర్మార్గమని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలను అణచివేయాలని ప్రధాని, సీఎం మధ్య రహస్య ఒప్పందం జరిగినట్లు కనబడుతోందని వారు ఆరోపించారు.  
 

మరిన్ని వార్తలు