జార్ఖండ్ సీఎంగా చంపయ్ సొరెన్ ప్రమాణం

2 Feb, 2024 12:45 IST|Sakshi

రాంచీ: జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంపయ్ సొరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు తెలిపారు. 10 రోజుల్లో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించారు. బలనిరూపణ వరకు ఉండేందుకు జేఎంఎం సంకీర్ణ ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకోనున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక విమానంలో జార్ఖండ్ ఎమ్మెల్యేలు మరికాసేపట్లో రానున్నారు. మాజీ సీఎం హేమంత్ సొరెన్‌ను ఈడీ అధికారుల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 

చంపయ్‌ సోరెన్‌ 1956 నవంబర్‌లో జిలింగోరా గ్రామంలో రైతు కుటుంబంలో  జన్మించారు. మెట్రిక్యులేషన్‌ చదివారు. తొలిసారిగా 1991లో సెరికేలా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటినుంచి వరుసగా విజయం సాధిస్తూనే ఉన్నారు. జేఎంఎం అధినేత శిబూ సోరెన్‌కు విధేయుడిగా పేరుగాంచారు. జార్ఖండ్‌ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అయితే, శిబూ సోరెన్‌ కుటుంబంతో చంపయ్‌ సోరెన్‌కు ఎలాంటి బంధుత్వం లేదు. హేమంత్ సొరెన్ కుటుంబంతో సన్నిహితంగా ఉంటారు. చంపయ్‌ను ప్రజలు జార్ఖండ్‌ టైగర్‌ అని పిలుస్తుంటారు. ఇప్పటివరకు రాష్ట్రంలో రవాణా మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.   

రాష్ట్ర మాజీ హేమంత్‌ సోరెన్‌ను బుధవారం ఈడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. గురువారం రాంచీలోని ‘ప్రత్యేక మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కోర్టు’లో ప్రవేశపెట్టారు. తదుపరి విచారణ నిమిత్తం సోరెన్‌ను 10 రోజులపాటు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం తమ తీర్పును శుక్రవారానికి రిజర్వ్‌ చేసింది. అలాగే సోరెన్‌ను ఒకరోజుపాటు జ్యుడీషియల్‌ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టును హేమంత్ సొరెన్ ఆశ్రయించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం స్పష్టం చేసింది.  

ఇదీ చదవండి: సుప్రీంకోర్టులో హేమంత్‌ సోరెన్‌కు ఎదురుదెబ్బ

whatsapp channel

మరిన్ని వార్తలు