Chandrababu Anantapur Tour: మాటల మరాఠీ.. మళ్లెందుకొస్తున్నావ్‌ బాబూ!

20 May, 2022 11:12 IST|Sakshi

రుణమాఫీతో రైతుకు కుచ్చుటోపీ 

హెరిటేజ్‌ కోసం ఏపీ డెయిరీ నిర్వీర్యం  

రూ.1,000 కోట్ల ఇన్‌పుట్‌కు ఎగనామం 

ఎన్టీఆర్‌ ఆశయం కింద రూ.776 కోట్లతో ఉత్తుత్తి ప్రణాళిక 

ఏ ముఖం పెట్టుకుని జిల్లాకు వస్తున్నావంటూ చంద్రబాబుపై ఆగ్రహం 

ఈ చిత్రంలోని రైతు పేరు లక్ష్మీనరసప్ప. మడకశిర మండలం సిద్దగిరి గ్రామం. తనకున్న మూడు ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. వ్యవసాయ పెట్టుబడుల కోసం తన మూడు ఎకరాలను 2013లో నీలకంఠాపురం ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.31 వేల పంట రుణం తీసుకున్నాడు. చంద్రబాబు ఎన్నికల హామీని నమ్మి రుణమాఫీ అవుతుందని ఆశపడ్డాడు. రుణం మాఫీ కాకపోగా వడ్డీతో కలిపి మొత్తం చెల్లించాలని 2019లో బ్యాంకు నుంచి నోటీసు వచ్చింది. దీంతో ఆందోళన చెందిన ఆయన అప్పు చేసి మరీ బ్యాంకు రుణం తీర్చారు. చంద్రబాబు మాటలు నమ్మి తనలాంటి వారు ఎందరో మోసపోయారని లక్ష్మీనరసప్ప చెబుతున్నారు.  

సాక్షి, పుట్టపర్తి: ఉత్తుత్తి హామీలు, అబద్ధాలు, నయవంచక పాలనను జనం ఇప్పటికీ మరువలేకపోతున్నారు. మాటల మరాఠీ చంద్రబాబునాయుడు హయాంలోని చీకటిరోజులు మళ్లీ రావొద్దని కోరుకుంటున్నారు. ఆనాడు అన్ని వర్గాలనూ బాదిన చంద్రబాబు... ఇప్పుడు ‘బాదుడే..బాదుడు’ అంటూ జిల్లా పర్యటనకు వస్తుండటంపై మండిపడుతున్నారు. సీఎం జగన్‌ జనరంజక పాలనలో ప్రజలంతా చల్లగా ఉన్నారని, ఉనికి కోసం అసత్యాలు చెప్పేందుకు మళ్లీ ఎందుకొస్తున్నావ్‌ బాబూ అంటున్నారు. చంద్రబాబు హయాంలో  జరిగిన నయవంచనను ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటున్నారు. 

ఏపీ డెయిరీ నిర్వీర్యం 
సొంత డెయిరీ హెరిటేజ్, ఇతర ప్రైవేట్‌ డెయిరీల కోసం చంద్రబాబు ప్రభుత్వ డెయిరీని నిర్వీర్యం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చే సమయానికి జిల్లాలో ఏపీ డెయిరీ ద్వారా 50 వేల నుంచి 60 వేల లీటర్ల రోజువారీ పాలసేకరణ ఉండేది. చంద్రబాబు దిగేపోయేసరికి 2 వేల లీటర్లకు పడిపోయిందంటే పరిస్థితి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.  

420 మంది రైతుల ఆత్మహత్యలు 
చంద్రబాబు హయాంలో ప్రకృతి సహకరించలేదు. ఆదుకోవాల్సిన ప్రభుత్వమూ ఆదుకోలేదు. ఫలితంగా వ్యవసాయం భారమై రైతులు, రైతు కూలీలు ఏటా 4 నుంచి 5 లక్షల మంది పొరుగు రాష్ట్రాలకు వలస పోయారు. 420 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. తన ఐదేళ్ల పాలనలో రైతులకు దక్కాల్సిన రూ.1,000 కోట్ల వరకు ఇన్‌పుట్‌ సబ్సిడీని చంద్రబాబు పెండింగ్‌లో పెట్టేశారు. 2016లో ఆచరణ సాధ్యం కాని రెయిన్‌గన్ల షో చేసి రూ.100 కోట్ల అనవసర ఖర్చు పెట్టేశారు.  

ఆగస్టు 15న ఉత్తుత్తి హామీ 
అనంతపురంలోని పీటీసీ మైదానం వేదికగా 2016, ఆగస్టు 15న జరిగిన రాష్ట్ర స్థాయి స్వాతంత్య్ర వేడుకల సాక్షిగా సీఎం హోదాలో చంద్రబాబు పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం ‘ఎన్టీఆర్‌ ఆశయం’ పేరుతో రూ.776 కోట్లు ఇస్తామని ప్రకటించి, బుట్టదాఖలు చేశారు.

రుణమాఫీ కాకపోవడంతో 2017 డిసెంబర్‌లో అనంత మార్కెట్‌ యార్డులో అర్జీలిచ్చేందుకు వచ్చిన రైతులు  

రుణమాఫీ వంచన 
‘రైతులెవరూ రూపాయి కూడా కట్టకుండా పూర్తిగా రుణమాఫీతో రుణ విముక్తులను చేస్తా’ అంటూ 2014 ఎన్నికల్లో హామీనిచ్చిన చంద్రబాబు.. గద్దెనెక్కిన వెంటనే మాట మార్చేశారు. కమిటీల పేరుతో ఏడాదిన్నర పాటు కాలయాపన చేశారు. అధికారంలోకి వచ్చేనాటికి జిల్లాలో రూ.10.24 లక్షల మంది రైతుల ఖాతాల పరిధిలో రూ.6,817 కోట్ల రుణ బకాయిలు ఉండేవి. ఇవన్నీ పూర్తీగా మాఫీ అవుతాయని రైతులు అప్పట్లో భావించారు. అయితే కేవలం రూ.2,744 కోట్లు మాత్రమే మాఫీ చేస్తామని ప్రకటించి అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లారు. ఇందులోనూ రూ.100 కోట్లు పెండింగ్‌ ఉంచారు. రుణమాఫీ కోసం వేలాది మంది రైతులు బ్యాంకులు, వ్యవసాయశాఖ, కలెక్టర్‌  గ్రీవెన్స్‌ల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది.  

వైఎస్‌ జగన్‌ రాకతో మారిన తలరాతలు 
సీఎంగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజల తలరాతలు మారిపోయాయి.  
► గ్రామగ్రామానా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు ముంగిటకే సేవలు తెచ్చారు.
► వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ కింద ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నారు. రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న రైతులకు వైఎస్సార్‌ సున్నావడ్డీ కింద ఇప్పటి వరకూ రూ.83 కోట్లు జమ చేశారు.  
► జగనన్న పాలవెల్లువ కింద ఇప్పటికే కదిరి డివిజన్‌లో మొదటి విడతగా 60 గ్రామాల్లో పాలసేకరణ చేపట్టారు. ప్రైవేట్‌ డెయిరీల కన్నా లీటర్‌పై అదనంగా రూ.10 వరకు పెంచి ఇస్తున్నారు.
► వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా కింద గత మూడేళ్లలో 4.52 లక్షల మంది రైతులకు రూ.629 కోట్ల పరిహారం చెల్లించారు.  
► ఇన్‌పుట్‌సబ్సిడీ కింద గత మూడేళ్లలో 1.05 లక్షల మందికి  రూ.121 కోట్లు ఇచ్చారు.  
► వైఎస్సార్‌ పశునష్ట పరిహార పథకం కింద చనిపోయిన పశువుకు రూ.15వేల నుంచి రూ.30 వేలు, గొర్రె, మేకకు రూ.6 వేల చొప్పున పరిహారం ఇస్తున్నారు.  
► చంద్రబాబు హయాంలో ఆత్మహత్య చేసుకున్న 106 మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున పరిహారం చెల్లించారు. మూడేళ్లలో 201 మంది రైతు ఆత్మహత్య కుటుంబాలకు రూ.11.65 కోట్లు ఇచ్చారు.  
► ఏటా రూ.80 కోట్ల వరకు సబ్సిడీతో నాణ్యమైన వేరుశనగ, పప్పుశనగ, కంది, ఇతర విత్తనాలు అందిస్తున్నారు. వైఎస్సార్‌ జలకళ పథకం కింద రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తున్నారు.  

చరిత్రను తిరగరాస్తున్న వర్షాలు 
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి తోడుగా ప్రకృతి కూడా సహకరించగా..భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కోటా మేరకు హెచ్చెల్సీ, హంద్రీ–నీవా జలాలతో చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయి. భూగర్భజలాలు 12 మీటర్ల పైపైకి ఎగబాకాయి. వలసలు ఆగిపోయాయి. వ్యవసాయ, అనుబంధ శాఖల కింద ఎన్నో పథకాలు అమలు చేస్తుండడంతో జిల్లా అంతటా రైతులు, రైతు కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి.

బాబు రుణమాఫీ హామీ బూటకం 
నాకు 3.50 ఎకరాల పొలం ఉండగా... కనగానపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రూ.50 వేలలోపు రుణం తీసుకున్నా. చంద్రబాబు రుణమాఫీ చేస్తానంటే ఆనందపడ్డాను. కానీ నేను తీసుకున్న రుణం మాఫీ కాలేదు. రెండు మూడు సార్లు అర్జీలు ఇచ్చినా ఫలితం లేదు. రుణమాఫీకి నోచుకోని నా లాంటి రైతులు చాలా మంది ఉన్నారు.  
– ఎల్‌.సురేష్, బద్దలాపురం (కనగానపల్లి) 

మరిన్ని వార్తలు