చంద్రబాబు, లోకేష్‌ల తీరు మారలేదు: మంత్రి బొత్స

26 Apr, 2021 18:41 IST|Sakshi

తాడేపల్లి: రాష్ట్రంలో కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించి చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు 104కు కాల్ చేసిన మూడు గంటల్లో బెడ్‌ కేటాయించాలని అధికారులకు ఆదేశించామన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా తీవ్రతపై కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి అన్ని శాఖలను సమన్వయం చేస్తున్నామని తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ చంద్రబాబు, లోకేష్‌ల తీరు అసలు మారలేదని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆక్సిజన్‌, బెడ్లు లేవంటూ దుష్ప్రచారం చేయడం తగదని వారికి సూచించారు.

ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఏ రోజైనా పనికొచ్చే సలహా ఒక్కటైనా ఇచ్చారా? అంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. రాష్ట్రంలోని విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీలో నిర్వీర్యంగా ఉన్న రెండు ప్లాంట్‌లను పునరుద్ధరించేందుకు సీఎం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. కరోనాను కట్టడి చేయడానికి లాక్‌డౌన్‌ ఆఖరి అస్త్రమని సాక్షాత్తు ప్రధానమంత్రి చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రంలో కరోనాపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకే చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

చదవండి: దోపిడీ సొమ్ములో చంద్రబాబు వాటా ఎంతో చెప్పాలి: కిలారి రోశయ్య

మరిన్ని వార్తలు