చంద్రబాబు-పవన్‌ భేటీలో ఏం జరిగింది? అసలు సమస్య అదేనా?

8 Jan, 2023 19:44 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. పూర్తి స్థాయిలో ప్రస్టేషన్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు ఎలాగొలా తాము కలిసి ఉన్నామన్న సంకేతం పంపడం ద్వారా అయినా తమ విజయావకాశాలు పెంచుకోవాలని తెగ తాపత్రయపడుతున్నారు. అందువల్లే రాజకీయ విలువలతో నిమిత్తం లేకుండా వీరిద్దరూ భేటీ అవుతున్నారు. నేరుగా తెలుగుదేశంతో ఇంతవరకు జనసేన పొత్తు పెట్టుకోలేదు. బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన నిత్యం టీడీపీతో కలిసి తిరుగుతోంది.

గతంలో టీడీపీ వారు తనను ఎంతో అవమానించారని పవన్ వాపోయినా, ఇప్పుడు అవన్ని మర్చిపోయి, కనీసం తనైనా ఎమ్మెల్యేగా గెలవాలన్న తాపత్రయంతో చంద్రబాబుతో పొత్తు కోసం తహతహ లాడుతున్నారు. చంద్రబాబు ఏమో పవన్‌ను అడ్డుపెట్టుకుని కాపు సామాజికవర్గ ఓట్లను లాగి అధికారం సాధించాలని ప్లాన్ వేస్తున్నారు. చంద్రబాబు చేసిన ఘోర పరాభవాలను మర్చిపోలేని భారతీయ జనతా పార్టీవారు తాము టీడీపీతో పొత్తు ప్రసక్తి లేదని తేల్చి చెబుతున్నారు.

భవిష్యత్తులో ఏమి అవుతుందో కాని, ఇప్పటికైతే టీడీపీ, జనసేన దాదాపు ఒక అవగాహనకు వచ్చేసినట్లే ఉన్నాయి. చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ అయిన నేపథ్యంలో సహజంగానే అది పెద్ద రాజకీయ వార్త అవుతుంది. బీజేపీతో కాపురం, టీడీపీతో సహజీవనం చేస్తున్న పవన్ కల్యాణ్‌ ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ఒకటి అవడానికి యత్నిస్తున్నారు. నిజానికి వీరు ఇద్దరూ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడి ఉంటారని ఎవరూ అనుకోవడం లేదు. అఫ్ కోర్స్ .. ఇంకా ప్రభుత్వాన్ని ఏ రకంగా బదనాం చేయాలి? ఎన్ని రకాలైన అబద్దపు కుట్రలు పన్నాలి అన్న విషయాలు ప్రస్తావనకు వచ్చి ఉండవచ్చు.

మీడియా సమావేశం తర్వాత వీరిద్దరూ చెప్పిన మాటలు విన్న తర్వాత ఈ అభిప్రాయం కలుగుతుంది. ఈ రెండు పార్టీలు కలిస్తే కొత్త ఎజెండాను ప్రకటించవచ్చు. విమానాశ్రయాలలో ఏ పార్టీ వారు అయినా పూలకుండీలు పగులకొట్టి, విధ్వంసం చేయవచ్చని వీరు హామీ ఇవ్వవచ్చు. ఇప్పటం గ్రామంలో  పవన్ కల్యాణ్‌ కారు టాప్‌పై తన ఇష్టం వచ్చినట్లు కూర్చున్నట్లుగా ఏపీలో ప్రజలు ఎవరైనా, కారుపై గాలితనంగా కూర్చోవచ్చనే హామీ ఇవ్వవచ్చు. రోడ్డుపై ఎవరు పడితే వారు తమ ఇష్టం వచ్చినట్లు ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించవచ్చు.

అయినా పోలీసులు ఏమైనా చర్య తీసుకుంటే వారిని టెర్రరిస్టులుగా ప్రకటించి తమ ప్రభుత్వం చర్య తీసుకుంటుందని వీరిద్దరూ  ఎన్నికల హామీగా  ఇవ్వవచ్చు. రోడ్డుపై సభలు పెట్టి తొక్కిసలాటలు జరిగినా కేసులు ఉండవు. కేసులు పెట్టిన పోలీసులపై చర్య తీసుకుంటాం. తొక్కిసలాటలలో మరణిస్తే వారి ఖర్మే తప్ప, సంబంధిత పార్టీకి ఎలాంటి బాధ్యత ఉండదని చెప్పవచ్చు. తెలుగుదేశం, జనసేన సభలకు భారీ ఎత్తున జనసమీకరణకు కానుకలు ఇస్తామని బహిరంగంగా ప్రకటించవచ్చు.

ఈ కొత్త ఎజెండాతో వీరు ఎన్నికలకు వెళితే ప్రజల నుంచి మంచి మద్దతు వస్తుందని వారు ఆశిస్తున్నారేమో తెలియదు. కందుకూరులో ఎనిమిది మంది తొక్కిసలాటలో మరణిస్తే పవన్ కల్యాణ్ వారిని ఎందుకు పరామర్శించలేకపోయారు? టీడీపీ వారి బాధ్యతారాహిత్యాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? గుంటూరులో కానుకల పేరుతో చంద్రబాబు సభకు జనాన్ని పోగుచేసి తొక్కిసలాటకు కారణమైన వారిని ఒక్క మాట అనని పవన్ కల్యాణ్, ప్రభుత్వం రోడ్లపై సభలు వద్దన్న జీఓతో ప్రజాస్వామ్యానికి ఏదో జరిగిపోయినట్లు చంద్రబాబుతో కలిసి మాట్లాడడం అంటే వారి మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

కుప్పంలో నిబంధనలు పాటించాలని కోరితే చంద్రబాబు పోలీసులను, ముఖ్యమంత్రి జగన్‌ను నోటికి వచ్చినట్లు దూషించి అదే ప్రజాస్వామ్యం అని అంటుంటే పవన్ అవునవును అంటున్నారు. బ్రిటిష్ కాలపు నాటి చట్టం అని చంద్రబాబు అంటుంటే అవును కదా అని తాన అంటే తందానా అంటున్నారు. అమెరికా, బ్రిటన్ తదితర దేశాలలో రోడ్లపై నిరసన తెలిపినా కఠిన శిక్షలు ఉంటాయి. జరిమానాలు ఉంటాయి. కాని ఏపీలో మాత్రం రోడ్లు రాజకీయ పార్టీల వికృత క్రీడలకు వేదికలు అవుతున్నాయి. రోడ్డు మీద సభ పెడితే జన సమీకరణకు మరీ ఎక్కువ కష్టపడనవసరం లేదు.

చుట్టు పక్కల ఉన్నవారంతా సభకు వచ్చినట్లే ప్రచారం చేసుకోవచ్చు. ఎటూ డ్రోన్‌ల ద్వారా ఉన్నవి, లేనట్లు, లేనివి ఉన్నట్లు చూపించవచ్చు. బహిరంగ సభకు జనం రాకపోతే పరువు పోతుందన్న భయం ఉండవచ్చు. ఈ జీఓకి వ్యతిరేకంగా ఏమి చేసేది చంద్రబాబు, పవన్‌లు ఎలాంటి కార్యాచరణను ప్రకటించలేదు. మరి వీరు ఏమి చర్చించి ఉంటారు? కచ్చితంగా వచ్చే ఎన్నికలలో పొత్తు ఎలా పెట్టుకోవాలి? బీజేపీని తమ గూటిలోకి ఎలా లాక్కురావాలి? ఒక వేళ వారు రాకపోతే, వీరిద్దరూ ఎలాంటి పొత్తు పెట్టుకోవాలి? మొదలైన విషయాలను చర్చకు వచ్చి ఉండవచ్చు.

చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని పరోక్షంగా చెప్పనే చెప్పేశారు. రాజకీయాలలో పొత్తులు ఉంటాయని, గతంలో టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకున్న విషయాన్ని ప్రస్తావించారు. నిజానికి ఆయన ఆ తర్వాత కాంగ్రెస్‌తో కూడా  పొత్తు పెట్టుకున్న సంగతి చెప్పి ఉండాలి. కావాలనే ఆయన ఆ పాయింట్ చెప్పకుండా జాగ్రత్తపడ్డారు. ఇంతకీ ముఖ్యమంత్రి పదవిని పవన్ కల్యాణ్‌ కోరుకుంటున్నారా? లేదా? కోరుకుంటే ఆ విషయంలో చంద్రబాబు స్పష్టత ఇచ్చారా?. తాము గెలిస్తే  తనకు కాకుండా పవన్ కల్యాణ్‌కు సీఎం సీటు ఇస్తామని ఆయన చెప్పగలరా?.

గతంలో ఎప్పుడూ తామే త్యాగం చేయాలా అని బాధపడ్డ పవన్ కల్యాణ్ దీనిపై పట్టుబట్టే శక్తి కలిగి ఉన్నారా? లేక చంద్రబాబు చెప్పే మాటలకు బుట్టలో పడిపోతారా? లేక తాను ఎమ్మెల్యేగా గెలిస్తే అదే పెద్ద పదవి అని సరిపెట్టుకుంటారా? ఇప్పటికే వైసీపీ నేతలు, మంత్రులు పలు విమర్శలు చేస్తూ  పవన్ కల్యాణ్‌ సంక్రాంతి కానుక అందుకోవడానికి తనను దత్తత తీసుకున్న తండ్రి వద్దకు వెళ్లారని వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ సీఎం పదవితో నిమిత్తం లేకుండా పవన్ పొత్తు పెట్టుకుంటే మాత్రం ఏదో ప్యాకేజీ డీల్‌కు అమ్ముడు పోయారన్న విమర్శలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
చదవండి: జీ హుజుర్‌.. చంద్రబాబుతో పవన్‌ భేటీ అందుకే..

ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ను, ముఖ్యమంత్రి జగన్‌ను  ఓడించే అవకాశం లేదు. అందుకే ఆయా పార్టీలను కలుపుకోవాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలతో జగన్ ఎంత బలవంతుడుగా ఉన్నది చెప్పకనే చెబుతున్నారనుకోవచ్చు. ఏది ఏమైనా ఏదో ఒక పేరుతో చంద్రబాబు, పవన్‌లు తరచుగా భేటీ అవుతూ టీడీపీ, జనసేన క్యాడర్‌కు ఒక సంకేతం పంపడానికి తంటాలు పడుతున్నారని అర్ధం చేసుకోవచ్చు.

కొన్ని జిల్లాలలో కమ్మ, కాపు సామాజికవర్గాల మధ్య చాలా అంతరం ఉంటుంది. ఒకరంటే ఒకరికి పడని రాజకీయ వాతావరణం ఉంటుంది. దానిని తగ్గించడానికి వీరు ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నారని గమనించవలసి ఉంటుంది. బీజేపీని వదలిపెట్టి అయినా చంద్రబాబు వేలు పట్టుకుని నడవడానికి పవన్ కల్యాణ్ సిద్దపడుతున్నారన్న విషయం ఈ భేటీలతో బోధపడుతుంది. ఎజెండాతో నిమిత్తం లేకుండా ఇలా అనైతిక పొత్తులను ఏపీ ప్రజలు ఆమోదిస్తారా? అన్నదే అసలు సమస్య. 
-హితైషి

మరిన్ని వార్తలు