ములాఖత్‌కొచ్చిన సీనియర్లపై బాబుకు కాలిందట.. కారణం ఇదేనట..

21 Oct, 2023 18:50 IST|Sakshi

రాజమండ్రి సెంట్రల్ జైల్లో 42 రోజులు పూర్తి చేసుకున్న చంద్రబాబు

ములాఖత్ కు వచ్చిన సీనియర్లపై మండి పడుతోన్న పార్టీ అధినేత

తనను జైలుకు పంపినా సీనియర్లు పట్టించుకోవడం లేదని ఆగ్రహం

రూ. 371 కోట్ల లూటీ జరిగిన స్కిల్ స్కాంలో ఆధారాలతో సహా దొరికిపోయిన టీడీపీ అధినేత చంద్రబాబు జైల్లో 40 రోజులు పూర్తి చేసుకున్నారు. మండలం రోజుల జైలు జీవితంలో ఆయన ఒక కిలో బరువు పెరిగారు. జైలు నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యులు ములాఖత్‌లో చంద్రబాబును కలుస్తున్నారు. తాను జైల్లో ఉంటే పార్టీలోని సీనియర్ నేతలు ఏమీ పట్టనట్లు ఉండిపోవడం చంద్రబాబుకు మంట తెప్పిస్తోందని సమాచారం. తన ప్రభుత్వంలో మంత్రి పదవులు అనుభవించిన వారు కూడా తాను జైలుకెళ్తే తమకేమీ పట్టనట్లు  ఉండిపోవడం ఏంటని చంద్రబాబు కుత కుత లాడిపోతున్నట్లు తెలుస్తోంది.

స్కిల్ స్కాంలో సెప్టెంబరు 9న చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ చేసిన వెంటనే ఆయన్ను విజయవాడ తరలించేందుకు హెలికాప్టర్  ఏర్పాటు చేశారు పోలీసులు. అయితే తాను తన కాన్వాయ్‌లోనే రోడ్డు మార్గంలో వస్తానని చంద్రబాబు అనడంతో  సరేలెమ్మని రోడ్డు మార్గంలో తీసుకువచ్చారు. రోడ్డు మార్గంలో తాను వస్తోంటే దారి పొడవునా పార్టీ కార్యకర్తలు.. పెద్ద సంఖ్యలో ప్రజలు రహదారి కిరువైపులా నిలబడి నిరసనలు తెలుపుతారని అది తన అనుకూల మీడియాలో అదే పనిగా చూపిస్తారని చంద్రబాబు అనుకున్నారు. అయితే ఆయన అనుకున్నదేదీ జరగలేదు. జనమే కాదు పార్టీ శ్రేణులూ చంద్రబాబు అరెస్ట్‌ను పట్టించుకోలేదు.

విజయవాడ చేరుకున్న తర్వాత చంద్రబాబును కొన్ని గంటల పాటు విచారించాక ఏసీబీ కోర్టు ముందు హాజరు పరిచారు. బాబుపై ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని భావించిన ఏసీబీ కోర్టు  జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ఆయన్న రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. చంద్రబాబును జైల్లో పెడితే రెండు తెలుగు రాష్ట్రాలూ అతలాకుతలం అయిపోతాయని చంద్రబాబు అనుకున్నారు. తమ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలకు పిలుపునిస్తారని జన జీవనాన్ని స్తంభింపజేస్తారని అపుడు తనకు కావల్సినంత మైలేజీ వస్తుందని చంద్రబాబు అనుకున్నారు. అయితే చంద్రబాబు జైలుకెళ్తే బాబుతో నేను అని ఓ చిన్న కార్యక్రమానికి పిలుపు నిచ్చారు అచ్చెన్నాయుడు. దానికి పార్టీ నేతలే సరిగ్గా  స్పందించలేదు. దీనిపై అచ్చెన్నాయుడు నొచ్చుకుంటూ పార్టీ శ్రేణులకు  లేఖ రాశారు కూడా.

జైల్లో రోజూ వివిధ పత్రికలు చదువుతోన్న చంద్రబాబు ఆశ్చర్యపోయారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన తనని అరెస్ట్ చేసినా పార్టీలో సీనియర్లు ఎవరూ వీధుల్లోకి రాకపోవడం.. నిరసన ప్రదర్శనలకు ప్లాన్ చేయకపోవడం.. ఎవరి ఇళ్లల్లో వారు కూల్‌గా కాలక్షేపం చేయడం గమనించిన చంద్రబాబుకు ఒళ్లు మండుకొచ్చిందని చెబుతున్నారు. ములాఖత్ లో తనను కలవడానికి వచ్చిన యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్‌లపై చంద్రబాబు జైల్లోనే నిప్పులు చెరిగినట్లు భోగట్టా. మీరంతా ఉండి ఏం చేస్తున్నారు? అని చంద్రబాబు మండి పడ్డంతో  సీనియర్ నేతల్లోనూ అసహనం పెల్లుబికిందని అంటున్నారు. మేం పిలుపు నిచ్చినా జనం నుండి స్పందన లేకపోతే ఏం చేయమంటారు? అని యనమల రామకృష్ణుడు  వివరించబోతే నాకేం చెప్పద్దు అక్కడ ఏం జరుగుతోందో నేను ఊహించగలను అని బాబు మండి పడ్డారట.

ఈ ములాఖత్ తర్వాత యనమల  పూర్తిగా పార్టీ పిలుపు నిచ్చిన ఆందోళనలకు దూరంగా ఉండిపోయారని పార్టీ వర్గాలే అంటున్నాయి. తన కుమారుడు న్యాయవాదులను మానిటర్ చేయడం కోసం ఢిల్లీలో ఉంటే పార్టీలో సీనియర్లు  పార్టీని పూర్తిగా గాలికి వదిలేశారని.. తనను విడుదల చేయించడానికి కానీ.. అరెస్ట్‌కు నిరసనగా ఆందోళనలను ఉధృతం చేయడానికి కానీ  సీనియర్ నేతలెవరూ పూనుకోకపోవడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోయారని అంటున్నారు. నేతలంతా చేతులెత్తేయడం వల్లనే   భువనేశ్వరిని పరామర్శ యాత్ర చేయాల్సిందిగా చంద్రబాబే  సూచించారని పార్టీ వర్గాల కథనం.
చదవండి: పవన్‌ కల్యాణ్‌ కొత్త ప్లాన్‌.. బీజేపీ లొంగుతుందా?

ఏ రోజుకారోజు బెయిల్ వచ్చేస్తుంది అన్న ఆశతోనే చంద్రబాబు గడుపుతున్నారని అంటున్నారు. అయితే అది ఎండమావిలా దూరం జరుగుతూ ఉండడంతో ఆయనలో నైరాశ్యం అలుముకుందని చెబుతున్నారు. ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలూ లేకపోయినా మూడు దశాబ్ధాలుగా ఉన్న స్కిన్  ఎలర్జీ మాత్రం కొద్దిగా ఇబ్బంది పెడుతోందని అంటున్నారు. నిజానికి స్కిన్ ఎలర్జీ కన్నా కూడా పార్టీ నేతలు తనను  పూర్తిగా వదిలేయడమే చంద్రబాబుకు ఎక్కువ నొప్పి రాజేస్తున్నట్లు సమాచారం. ఇదే ఆయన్ని ఎక్కువగా బాధిస్తోందట. దీన్ని భరించలేకపోతున్నానని ఆయన ములాఖత్‌కు వచ్చిన ఓ పార్టీ నేత వద్ద వాపోయినట్లు  సమాచారం.
-కుర్చీ కింద కృష్ణయ్య
 

మరిన్ని వార్తలు