ఆ ముగ్గురే ముంచారు!

27 Feb, 2021 05:23 IST|Sakshi
రాజుపేట రోడ్డు వద్ద ప్రసంగిస్తున్న చంద్రబాబు

చంద్రబాబుకు ఓడిన సర్పంచ్‌ అభ్యర్థుల ఫిర్యాదు

కుప్పం నుంచే ప్రజా చైతన్య యాత్ర చేస్తానని ప్రకటించిన బాబు

సాక్షి ప్రతినిధి, తిరుపతి: కుప్పం నియోజకవర్గంలోని పంచాయతీల్లో టీడీపీ ఘోర పరాభవానికి ఎమ్మెల్సీ శ్రీనివాసులు, పార్టీ ఇన్‌చార్జి మునిరత్నం, చంద్రబాబు పీఏ మనోహర్‌ కారణమని ఓడిన సర్పంచ్‌ అభ్యర్థులు చంద్రబాబు ఎదుట ఏకరువు పెట్టారు. దీటైన పోటీ ఇచ్చేందుకు ఆ ముగ్గురూ సహకరించలేదని తెలిపారు. గురు, శుక్రవారాల్లో చంద్రబాబును వేర్వేరుగా కలిసిన రామకుప్పం, శాంతిపురం మండలాల పార్టీ నాయకులు, సర్పంచ్‌ అభ్యర్థులు ఆ ముగ్గురిపైనా ఫిర్యాదులు చేశారు. అధికారంలో ఉండగా ఆ ముగ్గురి వల్ల ఆర్థికంగా లబ్ధి పొందిన వ్యక్తులను పంచాయతీ ఎన్నికల్లో పోటీకి దించలేదని తెలిపారు. అధికార పార్టీని దీటుగా ఎదుర్కొనే సామర్థ్యం, శక్తి తమకు లేకపోయినా పార్టీపై గల అభిమానంతో పోటీ చేశామని వివరించారు. ఆ ముగ్గురినీ ఇంకా నమ్ముకుంటే అసలుకు ఎసరు తప్పదని చంద్రబాబు ఎదుట తేల్చి చెప్పారు. చంద్రబాబు వారికి బదులిస్తూ.. అన్నీ తెలుసుకున్నానని, ఇకనుంచి క్రమం తప్పకుండా తాను లేదా లోకేశ్‌ కుప్పంలో పర్యటిస్తామని బుజ్జగించే ప్రయత్నం చేశారు. నియోజకవర్గంలో వైఫల్యాలను సమీక్షించుకుని పార్టీలో పునరుత్తేజం నింపుతారని భావించిన కార్యకర్తలకు నిరుత్సాహమే మిగిలింది. తానెంతో గొప్పవాడినని చెప్పుకోవడానికి, ఎదుటి వారిపై నిందలు వేయడానికే చంద్రబాబు పరిమితమయ్యారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. 

కుప్పం నుంచే ప్రజా చైతన్య యాత్ర
రామకుప్పం, రాజుపేట రోడ్డు, శాంతిపురంలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభల్లో చంద్రబాబు మాట్లాడుతూ.. కుప్పం నియోజకవర్గం నుంచే ప్రజా చైతన్య యాత్ర చేపట్టనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో అంబేడ్కర్‌ రాజ్యాంగం నడవటం లేదని, పులివెందుల రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు. ఇలాంటి అరాచక పాలన చేస్తుంటే యువకులుగా మీరేం చేస్తున్నారు, నిద్రపోతారా అంటూ రెచ్చగొట్టారు. తాను కూడా పట్టించుకోకపోతే ఈ రాష్ట్రం ఏమైపోతుందోననే బాధ ఉందని చెప్పుకొ చ్చారు. పోలీసు వ్యవస్థతో పోరాటం చేయాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదని, అధికారంలోకి రాగానే చక్రవడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మ ఒడి డబ్బు నాన్న బుడ్డికి సరిపోయిందంటూ ప్రభుత్వ పథకాలపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.  

మరిన్ని వార్తలు