నేను ఏడ్చినా మీకు పట్టదా?.. చిత్తూరు జిల్లా నేతలకు బాబు క్లాస్‌

26 Nov, 2021 10:02 IST|Sakshi

సాక్షి, తిరుపతి: ‘నేను ఏడ్చినా మీరు పట్టించుకోలేదు.. ఈ విషయాన్ని ఉపయోగించుకోవడంలో పార్టీ శ్రేణులు వెనుకబడి ఉన్నాయి.. కుప్పంలో ఓటమి నుంచి రాష్ట్ర ప్రజల దృష్టిని పార్టీ వైపు తిప్పుకుని బలపడేందుకు వచ్చిన మంచి అవకాశాన్ని వినియోగించుకోవడం లేదు.. నా భార్యను తిట్టారని నేను ఇంతగా చెబుతున్నా ఎవరూ పెద్దగా మాట్లాడటం లేదు.. ఇలాగైతే ఎలా?’ అంటూ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నేతలతో వాపోయినట్లు తెలిసింది.

చదవండి: ‘చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఊరారా ఈదుకుంటూ వెళ్లారా?’

వరద ప్రాంతాల పర్యటనలో భాగంగా ఆయన రెండు రోజుల పాటు చిత్తూరు జిల్లాలోనే ఉన్నారు. వైఎస్సార్‌ జిల్లా నుంచి బుధవారం రేణిగుంటకు చేరుకున్న చంద్రబాబు.. శ్రీకాళహస్తి, చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల్లో పర్యటించారు. ఆ రాత్రి రేణిగుంటలోనే బస చేసి.. గురువారం ఉదయం జిల్లా నాయకులందరినీ పిలిపించుకున్నారు. జిల్లాలో ఏం జరుగుతోందో ఎవ్వరూ చెప్పటం లేదని, ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా.. పార్టీ శ్రేణులు ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘నా ప్రయత్నం అంతా వృథా అవుతోంది. పార్టీ బలోపేతం కోసం నేను ఎంతగానో కష్టపడుతుంటే ఎవరూ దానిని పట్టించుకోవడం లేదు’ అని ఓ రేంజ్‌లో   ఫైర్‌ అయినట్లు తెలిసింది. కుప్పం ఓటమి తనను తీవ్రంగా కలచి వేసిందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.

‘సొంత జిల్లా.. సొంత నియోజక వర్గంలో ఒక మునిసిపాలిటీని గెలిపించుకోలేక పోయానని రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇలాంటప్పుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏం చేస్తారని అనుకుంటున్నారు. ఈ చర్చ ఇలానే కొనసాగితే మనం మరింత నష్టపోతాం. అలా జరగకూడదనేదే నా ఏడుపు. అయినా ఎవరికీ పట్టలేదు. మన వాళ్ల పనితీరు అస్సలు బాగోలేదు. ఇంత మంది ఉన్నారు. ఏం చేస్తున్నారు? అంతా డల్‌గా ఉంటున్నారు. ఏ విషయంలోనూ మీ నుంచి స్పందన కనిపించలేదు’ అని ఇద్దరు ముఖ్య నేతల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు ఆ పార్టీ నేతలు చర్చించు కుంటున్నారు. 

మరిన్ని వార్తలు