మా ప్రభుత్వం వచ్చాక వలంటీర్ల సంగతి చూస్తాం: చంద్రబాబు

8 Jan, 2022 19:11 IST|Sakshi

ప్రజలు దీవిస్తే పొత్తులతో పనేముంది?

కుప్పం పర్యటనలో చంద్రబాబు వ్యాఖ్యలు

అర్హులకు పథకాలు అందకుంటే నేనే కేసులేస్తా

టీడీపీలో తప్పు చేసే నాయకులను కార్యకర్తలే నిలదీయాలి

సాక్షి, కుప్పం, పలమనేరు:  ప్రజల ఆశీస్సులు ఉంటే పొత్తులతో పనే లేదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యాఖ్యానించారు. పొత్తులు లేకున్నా గెలుస్తామన్నారు. పొత్తులు ఉన్నప్పుడు టీడీపీ గెలిచిందని మరికొన్నిసార్లు ఓటమి పాలైందని చెప్పా రు. జీవితాంతం తాను కుప్పం నుంచే పోటీ చేస్తాన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడినుంచే గెలిచి ముఖ్య మంత్రి పదవి చేపట్టి తనను ఇబ్బంది పెట్టినవారిని శంకరగిరి మాన్యాలు పట్టిస్తానని హెచ్చరించారు. రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత కుప్పం నుంచే మెుదలవ్వాలన్నారు.

అక్రమాలు, అన్యాయాలకు పాల్పడే టీడీపీ నాయకులను కార్యకర్తలే ప్రశ్నించాలని, అప్పుడే వారికి బుద్ధి వస్తుందన్నారు. కుప్పం లో నాయకులతో పనిలేకుండా ఏరోజుకారోజు వాస్తవాలు తనకు తెలిసేలా మానిటరింగ్‌సెల్‌ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మూడు నెలలకోమారు కుప్పంలో పర్యటిస్తానన్నారు. శుక్రవారం కుప్పం మండలం దాసేగౌనూరు, కొత్తయిండ్లు తది తర గ్రామాల్లో చంద్రబాబు పర్యటించారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కుప్పం ప్రభుత్వా స్పత్రిలో ఆక్సిజన్‌ జనరేటర్‌ ప్లాంట్‌ను ప్రారం భించారు. ఆయాచోట్ల చంద్రబాబు ప్రసంగం వివరాలివీ..

అవసరమైతే నేనే కేసులేస్తా..
అర్హులకు ప్రభుత్వ పథకాలు అందకుంటే అధైర్య పడొద్దని, అవసరమైతే తానే కోర్టుల్లో కేసులు వేస్తానని చంద్రబాబు ప్రకటించారు. ‘పింఛన్లు తొలగించారని అధైర్యపడవద్దు. కోర్టుకెళ్లి వడ్డీతో సహా పింఛన్లు ఇప్పించే బాధ్యత టీడీపీదే’ అని చెప్పారు. ఈ ప్రభుత్వానికి వలంటీర్లు తొత్తులుగా మారారని, రేపు తమ ప్రభుత్వం వస్తే వారి సంగతి చూస్తామని హెచ్చరించారు. వైఎస్సార్‌ సీపీని గెలిపించినా నిజమైన కార్యకర్తలకు ఆ పార్టీలో న్యాయం జరగలేదని, కొందరు రౌడీలు దోచుకు తింటున్నారని చెప్పారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్ల తరువాత తాను కచ్చితంగా సీఎం అవుతానని, అప్పుడు ప్రత్యేక కమిషన్‌ వేసి వీరి సంగతి చూస్తానన్నారు. 

చదవండి: (AP: 500 ఎకరాల్లో 'అంతర్జాతీయ మెగా లెదర్‌ పార్క్‌')

పథకాలు అవసరమా?
పథకాల పేరుతో రూ.నాలుగువేలు ఆశచూపి ప్రజల నుంచి రూ.లక్షలు కొట్టేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. నిరుద్యోగులకు కనీసం జాబ్‌ క్యాలెండర్‌ కూడా అమలు చేయలేదన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి ఇంత భారీ స్థాయిలో అప్పులు చేసిన రాష్ట్రాన్ని చూడలేదన్నారు. ప్రజల సొమ్ము తింటూ పథకాలు పెట్టడం అవసరమా? అని ప్రశ్నించారు. 

చెప్పిందే చెబుతూ..
రెండోరోజు కుప్పం మండలంలో చంద్రబాబు రచ్చబండ, రోడ్‌షో జనం లేక వెలవెలబోయింది. అన్నిచోట్లా చెప్పిందే చెబుతుండడంతో జనం విసి గిపోయారు. మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనివి ధంగా చంద్రబాబు సెల్ఫీలు దిగడం, పిల్లలను ఎత్తుకోవడం, మహిళలతో ముచ్చ టించటాన్ని చూసి స్థానికులే ఆశ్చర్యపోయారు. పవన్‌కల్యాణ్‌తో కలసి పనిచేస్తే బాగుంటుందని మాజీమంత్రి అమర్‌నాథ్‌రెడ్డి విలేకరులతో పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు