48 గంటలు గడువిస్తున్నా

4 Aug, 2020 06:19 IST|Sakshi

3 రాజధానులపై రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలి

సాక్షి, అమరావతి: మూడు రాజధానుల అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి 48 గంటల గడువు ఇస్తున్నానని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎన్నికల ముందు చెప్పలేదు కాబట్టి ప్రభుత్వం రాజీనామా చేయాలని, అందరం కలసి ఎన్నికలకు వెళ్లి ప్రజాతీర్పు కోరదామని అన్నారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి ఎంపిక చేసిన మీడియాతో ఆన్‌లైన్‌లో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికల ముందు చెప్పకుండా ఇప్పుడు రాజధానిని ఎలా మారుస్తారని ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...

► ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నాశనం చేసే అధికారం ఎవరికీ లేదు. రాజధాని సమస్య ఏ ఒక్కరిదో కాదు. ఐదు కోట్ల ప్రజలది. 
► ఎన్నికల ముందు రాజధానిపై చెప్పకుండా ప్రజలను మభ్యపెట్టారు. ఎన్నికలు అయిన తరువాత మా ఇష్టానుసారం చేస్తామన్న ధోరణి మంచిది కాదు. ఈ అధికారం మీకు లేదు. ఆ రోజు ఏం చెప్పారు.. ఈరోజు ఎలా మోసం చేశారో అనేది ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. 
► రాజధాని అంశంపై ఎన్నికలకు వెళ్లకుండా అమరావతిని మార్చే హక్కు ఎవరికీ లేదు.
► టీడీపీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయమనడం ఏమిటి? రాజీనామా చేసేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ముందుకు రావాలి. మా సవాల్‌ను స్వీకరిస్తారా లేదా?
► మళ్లీ ఎన్నికలకు వెళ్లి ప్రజామోదంతో ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పును మేం స్వాగతిస్తాం.  
► 48 గంటల తరువాత బుధవారం సాయంత్రం 5 గంటలకు మళ్లీ మీడియా ముందుకు వస్తా. ఈలోగా ప్రభుత్వం తేల్చుకోవాలి. 

మరిన్ని వార్తలు