పవన్‌ సినిమాకు ఎందుకు రాయితీ ఇవ్వలేదు?

11 Apr, 2021 04:18 IST|Sakshi
రోడ్‌షోలో ప్రసంగిస్తున్న చంద్రబాబు

ఇది కక్ష సాధింపు కాదా?

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్న

పోలీసులపైనా అక్కసు

సూళ్లూరుపేట: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ నటించిన తాజా సినిమాకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రాయితీలు ఇవ్వలేదని, గతంలో అన్ని సినిమాలకు ఇచ్చిన రాయితీలు ఈ సినిమాకు ఎందుకు ఇవ్వలేకపోయారని, ఇది కక్షసాధింపు కాదా అని టీడీపీ అధినేత  చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో శనివారం ఆయన తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా రోడ్‌షో నిర్వహించారు. స్థానిక బస్టాండ్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. ‘నా హయాంలో రూ.ఆరు లక్షల కోట్లు అవినీతి జరిగిందని ఈ ప్రభుత్వం ఆరోపించింది.. మరి ఈ రెండేళ్లలో కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నట్లుగా ఈ ప్రభుత్వం తీరు ఉంద’ని ఆయన ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ ఎంపీలు ముగ్గురు రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారని, వైఎస్సార్‌సీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించే దమ్ము ధైర్యం సీఎం వైఎస్‌ జగన్‌కు ఉందా అని చంద్రబాబు సవాల్‌ విసిరారు.

పోలీసులూ ఖబడ్దార్‌
కాగా, సభలో ‘పోలీసుల్లారా ఖబడ్దార్‌’ అంటూ టీడీపీ అధినేత విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని అమలుచేయకుండా సీఎం వైఎస్‌ జగన్‌ తన సొంత రాజ్యాంగాన్ని నడిపిస్తూ పోలీస్‌ వ్యవస్థను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోలీసులే అన్ని తామై ఏకగ్రీవాలు చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రిపైనా వ్యక్తిగత విమర్శలు చేశారు. చంద్రబాబు చేసిన సుదీర్ఘ ప్రసంగానికి సభికుల నుంచి స్పందన లేకపోగా.. వారంతా మధ్యలో జారుకోవడం కనిపించింది. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు