-

కోవిడ్‌ మృతుల పేర్లు బయటపెట్టాలి 

30 Jun, 2021 05:04 IST|Sakshi

కరోనాకు ప్రపంచమంతా భయపడినా జగన్‌ తేలిగ్గా తీసుకున్నారు 

రెమ్‌డెసివిర్‌ జగన్‌ సహ నిందితులదే 

భారత్‌ బయోటెక్‌ నేను నాటిన విత్తనమే  

‘సాధన దీక్ష’లో చంద్రబాబు  

సాక్షి, అమరావతి: ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో కోవిడ్‌తో 12,500 మంది చనిపోయారని, వారి పేర్లను బయటపెట్టాలని ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ప్రపంచమంతా కరోనాకు భయపడినా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తేలిగ్గా తీసుకున్నారని, అందుకే ఎంతోమంది మరణించారని అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో వివిధ డిమాండ్లతో ‘సాధన’ పేరుతో మంగళవారం 3 గంటలపాటు చంద్రబాబు దీక్ష చేశారు. ఉదయం అల్పాహారం తర్వాత ప్రారంభమైన దీక్ష, మధ్యాహ్న భోజనానికి ముందు ముగిసింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, ఆక్సిజన్‌ అందక చనిపోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు, ప్రాణాలు కోల్పోయిన ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు. కరోనా బాధితులను ఆదుకునేందుకు తాను చేస్తున్న దీక్ష ఒక చరిత్రని తెలిపారు. సీఎం ఒక్క వ్యాక్సిన్‌ కూడా కొనలేదన్నారు. ఉమ్మడి ఏపీలో తాను సీఎంగా ఉండగా నాటిన విత్తనమే భారత్‌ బయోటెక్‌ అని చెప్పారు. ఆ కంపెనీ వ్యాక్సిన్‌ తీసుకువస్తే దానికి కులం అంటగడుతున్నారని విమర్శించారు. సీఎం సహ నిందితుల వద్ద వ్యాక్సిన్‌ ఉన్నా ప్రజలకు ఎందుకు ఇవ్వలేదని, రెమ్‌డెసివిర్‌ జగన్‌ సహ నిందితులది కాదా అని ప్రశ్నించారు.  

కేంద్రం పంపిన వ్యాక్సిన్లు వేసి గొప్పలు 
రాష్ట్రంలో ఇప్పటివరకు కేవలం 23.2 శాతం మందికి మాత్రమే కరోనా వ్యాక్సిన్‌ వేశారని చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్రం పంపిన 13 లక్షల వ్యాక్సిన్‌లు ఒకేసారి వేసి దేశంలో తామే ఎక్కువ వ్యాక్సిన్లు వేశామని గొప్పలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. అన్ని రాష్ట్రాల్లో కరోనా బాధితులను ఆదుకున్నారని, ఇక్కడ ఏమిచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కోవిడ్‌ వచ్చిన వారికి రూ.2 వేలు, మరణించిన వారి అంత్యక్రియలకు రూ.5 వేలు ఇవ్వాలన్నారు. కరోనా బాధితులకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం చేసి ప్రజల రుణం తీర్చుకుంటామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.10 వేల చొప్పున ఇవ్వాలని కోరారు. రైతులు పండించిన పంటలు కొని డబ్బులు ఇవ్వలేదని, వెంటనే వారికి చెల్లింపులు జరపాలని డిమాండ్‌ చేశారు.

ఏడాదిన్నరగా కరోనా సమయంలో అన్ని ధరలు పెరిగిపోయాయని, ఇబ్బందుల్లో ఉన్న ప్రజలపై పన్నుల భారం మరింత పెంచారని విమర్శించారు. జాబ్‌ లెస్‌ క్యాలెండర్‌తో యువత రెచ్చిపోయే స్థితికి వస్తే వాళ్లపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రజలకు మజ్జిగ పోసి మీగడంతా సీఎం తినేస్తున్నారన్నారు. బ్రిటిష్‌ వాళ్ల కంటే ఎక్కువగా దోచేస్తూ  ప్రజలకు ఏదో చేశామని డప్పులు కొట్టుకుంటున్నారని విమర్శించారు. దేశంలో అన్ని రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేస్తే ఏపీలో ఎలా నిర్వహిస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తే తప్పుడు లెక్కలు ఇచ్చారని ఆరోపించారు. ఒక్క విద్యార్ధి చనిపోయినా రూ.కోటి ఇవ్వాలని సుప్రీంకోర్టు చెబితే సీఎం తోకముడిచి అప్పుడు పరీక్షలు రద్దు చేశారని తెలిపారు. తాను చేపట్టిన దీక్షను పక్కదారి పట్టించేందుకు దిశ చట్టం కార్యక్రమం పెట్టారన్నారు. దిశ చట్టం లేదు కానీ పోలీస్‌ స్టేషన్లు, వాహనాలు, యాప్‌ తీసుకురావడం విడ్డూరమన్నారు. సీఎం ఇంటి పక్కన మహిళపై అత్యాచారం జరిగితే దోషులను ఇంతవరకు పట్టుకోలేదన్నారు.   

మరిన్ని వార్తలు