మందుబాబులు నాకే ఓటు వేయాలి

13 Apr, 2021 12:42 IST|Sakshi

మీటింగ్‌కు వస్తారు.. ఓట్లు మాత్రం వేయరు

పవన్‌ సినిమాను అడ్డుకుంటారా?

మళ్లీ వస్తా.. పోలీసుల అంతు చూస్తా

తిరుపతి ప్రచార సభలో చంద్రబాబు 

తిరుపతి అర్బన్, అన్నమయ్య సర్కిల్‌: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మద్యం ధరలను విపరీతంగా పెంచారని, అందుకే మందు బాబులంతా సైకిల్‌ గుర్తుకే ఓటు వేయాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా సోమవారం రాత్రి ఆయన కృష్ణాపురం ఠాణా వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. తనకు సీఎం పదవిపై ఏమాత్రం ఆసక్తి లేదని, ప్రజా సేవే ముఖ్యమని చంద్రబాబు చెప్పారు. తాను నిర్మించిన హైదరాబాద్‌లో ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్‌ తయారైందన్నారు. తిరుపతిలో ఐఐటీ, ఐసర్, కేంద్ర వర్సిటీని స్థాపించానని చెప్పారు.

అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు రేణిగుంటలో వందకుపైగా పరిశ్రమలు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇటీవల అన్యాయంగా రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో తనను తొమ్మిది గంటలు నిర్బంధించారని చంద్రబాబు వాపోయారు. తాను అనుకుని ఉంటే జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేసేవారా అని ప్రశ్నించారు. తన సభలకు జనస్పందన ఉన్నా, ఓట్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను నిలదీయడం వల్లే ఆలయాలపై దాడులు తగ్గాయని చెప్పారు. బంగారు బాతు అయిన అమరావతిని మూడు రాజధానుల పేరుతో ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

తాను సీఎంగా ఉన్న సమయంలో సినిమాలకు రాయితీలు ఇచ్చి, టికెట్‌ ధరలు పెంచుకోమని ప్రోత్సహించానని చెప్పారు. పవన్‌ కల్యాణ్‌ సినిమా ఆదాయాన్ని తగ్గించేందుకే ఈ ప్రభుత్వం టికెట్‌ ధరలు పెంచలేదన్నారు. ఈ ప్రాంతంలో పాయ బావుంటుందని, దోసెలు బావుంటాయని కబుర్లు చెప్పినా జనం వెళ్లిపోతుండటంతో అసహనానికి గురయ్యారు. చివరలో పోలీసులపై కూడా చిందులేశారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అంతు చూస్తానంటూ రెచ్చిపోయారు.    

మరిన్ని వార్తలు