చంద్రబాబుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందెవరు?

22 Apr, 2023 11:56 IST|Sakshi

కృష్ణా జిల్లాలోని ఆ నియోజకవర్గంలో ఎలాగైనా సైకిల్ జెండా ఎగరేయాలని పచ్చ పార్టీ అధినేత బోల్డన్ని ప్లాన్‌లు వేస్తున్నారు. అధికార పార్టీ నేతను ఓడించేందుకు బాగా సంపాదించిన ఎన్‌ఆర్‌ఐని రంగంలోకి దించారు. అయితే అక్కడ ఎప్పటినుంచో ఉన్న నేతలు ఎన్‌ఆర్‌ఐని పట్టించుకోవడంలేదట. పాపం చంద్రబాబు ఆ నియోజకవర్గంలో పర్యటనకు వెళితే రెండు వర్గాలు కొట్టుకుని జనాన్ని తేవడం మర్చిపోయారట. ఆ నియోజకవర్గం సంగతేంటో చూద్దాం.

వైఎస్సార్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యే మీద గెలవడం సంగతి తర్వాత.. ముందు అమెరికా నుంచి దించిన ఎన్‌ఆర్‌ఐ.. లోకల్ లీడర్లు కలిసి పని చేసేవిధంగా చూసుకోండని పచ్చ పార్టీ మీద సెటైర్లు పడుతున్నాయి. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన కొడాలి నాని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు కొరకరాని కొయ్యలా మారారు. తన పరువు తీస్తూ.. కంటి మీద కునుకులేకుండా చేస్తున్న కొడాలి నానిని ఎలాగైనా ఓడించాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారు.

ప్రస్తుతం గుడివాడ ఇన్‌చార్జ్‌గా ఉన్న రావి వెంకటేశ్వరరావుకు కొడాలి నానిని ఎదుర్కొనడం సాధ్యం కాదని అర్థం చేసుకున్న చంద్రబాబు అమెరికాలో బాగా సంపాదించిన వెనిగండ్ల రామును తీసుకువచ్చారు. ఆయన వచ్చీ రావడంతోనే నియోజకవర్గంలో రావికి వ్యతిరేకంగా ఉన్న కొంతమంది స్థానిక నేతలను తనవైపు తిప్పుకున్నారట.

చంద్రబాబు మద్దతుతో ఎన్‌ఆర్‌ఐ వెనిగండ్ల రాము దిగగానే అప్పటివరకు పార్టీకోసం పనిచేసిన రావి వెంకటేశ్వరరావు ఒంటరిగా మిగిలారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలోని సీనియర్ టీడీపీ నేతలు పలువురు రావి వెంకటేశ్వరరావుకు మద్దతుగా నిలిచారు. ఇప్పడిదే గుడివాడలో హాట్ టాపిక్‌గా మారింది. చంద్రబాబు గుడివాడ పర్యటన సందర్భంగా కూడా పార్టీలోని రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది.

మొన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న రావి వెంకటేశ్వరరావు సీనియర్ల మద్దతుతో చంద్రబాబు టూర్ సందర్భంగా ఎన్‌ఆర్‌ఐ వర్గంతో తలపడ్డారు. దీంతో బాబు సభ పక్కకు పోగా రెండు వర్గాల మధ్య కొట్లాట హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరి గొడవతో అసలే తక్కువగా వచ్చిన జనాల్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో చంద్రబాబు రాకముందే అందరూ వెళ్ళిపోయారు. ఇస్తామన్న డబ్బలు ఇవ్వకపోవవడంతో టీడీపీ నేతలతో కిరాయికి వచ్చిన వారు గొడవ పడటం కూడా చర్చకు దారి తీసింది.

చంద్రబాబు గుడివాడ పర్యటన ఖర్చంతా భరించడానికి ఎన్‌ఆర్‌ఐ వెనిగండ్ల రాము రెడీ అయ్యారు. అయితే బాబు పర్యటన ఏర్పాట్లు సమీక్షించడానికి సమావేశమైన జిల్లా నేతలు వెనిగండ్లను పిలవలేదట. మరోవైపు నియోజకవర్గ ఇన్‌చార్జ్ రావి వెంకటేశ్వరరావు చెప్పినట్లు చేయాల్సిందేనంటూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి పేరుతో విడుదలైన లేఖ తీసుకెళ్లి వెనిగండ్ల రాము చంద్రబాబు దగ్గరే పంచాయితీ పెట్టారట.
చదవండి: ఆ పోస్టర్ల వెనుక మాజీ మంత్రి గంటా హస్తం ఉందా?.. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది?

పార్టీ కోసం ఎంతో ఖర్చు చేస్తున్న తనకు ఇచ్చే విలువ ఇంతేనా అంటూ కడిగేశారట. నియోజకవర్గంలోని పరిస్థితులు, తన పర్యటన కారణంగా సంభవించిన పరిణామాలు చంద్రబాబుకు శిరోభారంగా మారాయని టాక్. అయితే గుడివాడ సీటు వెనిగండ్ల రాముకే అనే సంకేతాలు చంద్రబాబు ఇవ్వడంతో బుధవారం సాయంత్రం జరిగిన కార్యక్రమం సందర్భంగా నానా రచ్చ జరిగింది.

మొత్తంగా మాంచి దూకుడుగా ఉపన్యాసం ఇద్దామని గుడివాడ వచ్చిన చంద్రబాబుకు సొంత పార్టీ నేతలే చుక్కలు చూపించారు. ఒక వైపు పార్టీ నేతల మధ్య గొడవలు, సభకు జనం  లేకపోవడంతో చంద్రబాబు అందరిమీద అసహనం వ్యక్తం చేశారని సమాచారం.
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి వెబ్ డెస్క్‌


 

మరిన్ని వార్తలు